చేర్యాల, డిసెంబర్ 3: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మల్లన్న ఆలయ పాలక మండలి నియామకం అందరికీ తలనొప్పిగా మారింది. దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగానే నిబంధనల ప్రకారం ఆలయ ధర్మకర్తల మండలికి 72 మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందితోపాటు జనగామకు చెందిన ఓ నాయకుడిని చైర్మన్‌గా నియమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు జనగామ నియోజవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సిపారసు లేఖలను దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు ఇటీవల పంపించారు.
వారు పంపించిన సిపారసు లేఖలో పేరున్న నాయకుడిపై కేసులు నమోదై ఉండడంతో దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనల మేరకు ఆలయ పాలక మండలి లేదా ఉత్సవ కమిటీలో చోటు కల్పించే అవకాశం లేకపోవడంతో దేవాదాయ శాఖ కమిషనర్ సదరు నాయకుడి పేరును కాకుండా ఇతరులతో కమిటీ నియమిస్తామని చెప్పడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడంతో వెంటనే కమిటీని నియమించాలని కోరుతూ మంగళవారం పలువురు నేతలు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డిని సైతం కలిసినట్లు తెలిసింది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం జీవో 463 జారీ చేశారు. అందులో చిగారీ కొమరయ్య, కాయితా మోహన్‌రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, వల్లాద్రి అంజిరెడ్డి, మామిడాల లక్ష్మి, నేరెల్లపల్లి మహేందర్‌రెడ్డి, కొప్పురపు జయప్రకాశ్‌రెడ్డికి చోటు కల్పించారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చోటు కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని జీవో 464ను జారీ చేశారు. ధర్మకర్తల మండలిలో 14 మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది, 8మందిని నియమించగా, మిగిలిన ఆరుగురు సభ్యుల కోసం మరో జీవో జారీ చేశారు. ఇప్పటికే 72 మంది దరఖాస్తు చేసుకోగా, నూతనంగా మరో జీవో జారీ చేసి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.