దేవుళ్లు, రాజకీయ నాయకులు, ఆభరణాలతో పాటు ఆసక్తికర పేర్లతో పిలుపులు
ఆకృతి, స్థలం, కల్లు రుచిని బట్టి నామధేయం
గుర్తింపు కోసమే చెట్టుకో పేరంటున్న గీత కార్మికులు
ధూళిమిట్ట, ఫిబ్రవరి 5;బంగారు బిందె, వజ్రం, ముత్యం, పగడం ఇవన్నీ వస్తువులు, ఆభరణాల పేర్లు కాదు.. ఒకే రూపంలో ఉండే తాటి వృక్షాల నామధేయాలు. అవును..! నిజమే.. తాటి చెట్లకు తీరొక్క పేర్లు పెట్టి పిలుస్తుంటారు కల్లు గీత కార్మికులు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల పరిధిలోని ఆయా గ్రామాల గీత కార్మికులు ఏకరూప సారూప్యంలో ఉండే తాటి వృక్షాలకు నామకరణం చేస్తుంటారు. ప్రతి మనిషికి ఒక పేరు సర్వసాధారణం. అదేమాదిరిగా మనుషులకు జన్మనక్షత్రం, పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని ఎలా పేర్లు పెడతారో ఇక్కడ కూడా వృక్షాల ఆకృతి, స్థలం, దాని నుంచి వచ్చిన కల్లు రుచిని బట్టి పేర్లు పెట్టుకుంటారు. దేవుళ్ల పేర్ల నుంచి మొదలుకుని రాజకీయ నాయకులు, వివిధ ఆభరణాలతో పాటు ఆసక్తికర పేర్లతో పిలుస్తుంటారు. ఒకేరకంగా ఉండే తాటి చెట్లను గుర్తింపు కోసమే వివిధ రకాల పేర్లు పెట్టుకుంటున్నామని గీత కార్మికులు చెబుతున్నారు. ప్రకృతి సురాపానమైన కల్లునిస్తున్న తాటి చెట్ల తీరొక్క పేర్లతో ఈ వారం సండే స్పెషల్ కథనం..తాటి చెట్లను సాధారణంగా వాడుక భాషలో ‘తాడు’ ‘బొత్త’ అంటుంటారు. మనం ప్రతి ఎండాకాలంలో తినే ముంజల్ని ఇచ్చే చెట్లను ‘పండు తాళ్లు’ (ఆడ) అని, డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు రుచికరమైన, ఆరోగ్యకరమైన కల్లును అందించే చెట్లను ‘పోతు తాళ్లు’ (మగ) అని పిలుస్తుంటారు. అయితే చెట్లకు పేరు పెట్టేటప్పుడు అవి పెరిగిన ప్రదేశం, దాని ఆకారం, అది కల్లు ఇచ్చే తీరును బట్టి ఖరారు చేస్తారు. అందులో కొన్ని ఆకర్షణీయమైన పేర్లు, మరికొన్ని సాధారణ పేర్లు, మరిన్ని దైవాల పేర్లు ఉంటాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని పలు గ్రామాల్లో తాటి చెట్లకు పలురకాల పేర్లున్నాయి. దాంట్లో భాగంగా జాలపల్లి గ్రామంలో గల పేర్లను, వాటి నేపథ్యంపై ఓ లుక్కేద్దాం.
కల్లునిచ్చే పద్ధతిని బట్టి చెట్లపేర్లు…
జాలపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు కంకటి రాజయ్య గతంలో ఒక చెట్టు ఎక్కి, కల్లు అమ్మి సంపాదించిన డబ్బుల ద్వారా తులం బంగారం కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆ చెట్టుకు ‘తులం బంగారం’ అని, మరొక దానికి ‘బంగారు తీగ’ అని, ఒక చెట్టు గీయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ వ్యక్తి పట్టీలు కొనడంతో ఆ చెట్టకు ‘పట్టగొలుసులది’ అని, అన్నింటికంటే అందమైన పేరు కలిగిన చెట్టుగా ‘కలికితురాయి’ అని, మేఘాల రంగు కల్లును ఇచ్చే చెట్టకు ‘ఇంద్ర ధనస్సు’ అని., ఒక చెట్టు ఎక్కువగా కల్లునిస్తున్న సమయంలో వ్యక్తులు చెట్లను తలా కొన్నిగా పంచుకుంటున్న సందర్భంలో ఒకే చెట్టు కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడడంతో ఆ చెట్టుకు ‘పంచాయితీ బొత్త’ అని, మంచిగా కల్లునిస్తున్న చెట్లకు ముద్దుగా ‘ముత్యం’, ‘పగడం’, ‘వజ్రం’ వెన్నముద్ద, బంగారు బిందె, బాలింతరాలు, పెద్దనాము అని నామకరణం చేశారు.
వ్యక్తుల, కులాల ఆధారంగా చెట్లకు పేర్లు…
గతంలో బందారం రాజయ్య అనే గీతకార్మికుడు ఇష్టంగా ఒక చెట్టును చాలా దఫాల్లో ఏరికోరి ఎక్కడంతో, ఆ చెట్టుకు అతడి పేరున ‘రాజయ్య బొత్త’గా నామకరణం చేశారు. అలాగే జాలపల్లికి చెందిన చెల్కల గంగయ్య పేరున కూడా ‘గంగయ్య పటేల్ బొత్త’ అని నామకరణం చేశారు. గీతకార్మికులకు అనేక కులాలతో వృత్తి రీత్యా అవసరాలు ఉంటాయి. దాంట్లో భాగంగా గ్రామంలోని కుమ్మరి కులస్తులకు ‘కుమ్మరోని చెట్టు’ , కమ్మరి కులస్తులకు ‘కమ్మరోని చెట్టు’ అని నామకరణం చేసి, ఆ చెట్టును వారికే ఇచ్చేయడం ఇక్కడ గీతకార్మికులకు అలవాటు.
రాజకీయ నాయకుల పేర్లు…
దేశంలోనే గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగిన వారి పేర్లు చెట్లకు ఎందుకు ఉండకూడదని భావించి మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్లను కూడా చెట్లకు నామకరణం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ అని కూడా ఓ చెట్టుకు నామకరణం చేశారు.
ప్రదేశం ఆధారంగా చెట్లపేర్లు…
చెట్లు అవి పెరిగిన ప్రదేశం ఆధారంగా వాటికి నామకరణం చేస్తారు. చాకలి కులస్తుల చాకిరిల వద్ద ఉన్న చెట్లకు ‘సాకర్ల కాడిది’ అని, ఎక్కువగా తేళ్లు తిరిగే ప్రదేశంలో ఉన్న చెట్టకు ‘తేళ్ల బొత్త’ అని నామకరణం చేశారు. పుష్పాల ఆధారంగా ఓ చెట్టుకు అల్లి పుష్పం అని పేరు పెట్టారు. ఇలా పలు అంశాలను ప్రామాణికంగా చేసుకొని చెట్లకు దాని గుణం, ఆకారాన్ని బట్టి నామకరణం చేయడం ఎందుకోసమంటే గీత కార్మికులు తలా కొన్ని చెట్లు పంచుకునే సమయంలో ఫలానా చెట్టు నాకు కావాలి అని చెప్పేందుకే పెట్టుకుంటున్నట్లు తెలిపారు.
దేవుళ్ల పేర్లతో…
పార్వతీ దేవి చెట్టు: ఈ చెట్టు పండుతాడు (ఆడ చెట్టు) ఎక్కువగా కల్లునిస్తూ, ఆ చెట్టు ఎక్కేవారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని గీతకార్మికులు చెబుతున్నారు.
పరమేశ్వరుడి చెట్టు: ఇది పోతుతాడు (మగ చెట్టు) డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకూ అమితంగా కల్లును ఇవ్వగల చెట్టు, అలాగే సురపాన ప్రియులు ఈ చెట్టు కల్లు అంటే చాలా ఇష్టపడుతుంటారు. దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరులను ఆదిదేవులుగా కీర్తిస్తారు. ఇక్కడ కూడా ఈ రెండు చెట్లు ఆది దంపతుల పేరున స్థిరపడ్డాయి. ఇవి పక్కపక్కనే ఉంటాయి.
గుర్తింపు సులభమైంది…
నేను 7 ఏండ్లుగా చెట్లు ఎక్కుతున్నా. మొదట చెట్లకు పేర్లు ఏందని గమ్మత్తుగా అనిపించింది. తర్వాత తలా కొన్ని చెట్లు పంచుకునే సమయంలో చెట్లకు పేర్లు పెట్టడం వెనకగల ఆవశ్యకత అర్థం అయింది. నాకు చెట్లను గుర్తించడం సులభమైంది. పెద్దలు చేసే పని సతతమూ ఆమోదం, హర్షణీయమే కదా.
– అయిలేని రాజ్‌కుమార్ గౌడ్, గీతకార్మికుడు, జాలపల్లి