పటాన్చెరు రూరల్, ఆగస్టు 18 : ఆధునిక యుగంలో జరిగే యుద్ధ్దాల్లో జియోస్పేషియల్ టెక్నాలజీ అదృశ్య ఆయుధంగా పనిచేస్తుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ సీనియర్ శాస్త్రవేత్త, ట్రిబుల్ ఐటీ పీహెచ్డీ స్కాలర్ వై.పద్మజ అన్నారు. సోమవారం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘జియో-స్పేషియల్ ఆపరేషన్స్, రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు’ అనే అంశంపై ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
జియోస్పేషియల్ సాంకేతికత శత్రు స్థావరాలు, అక్కడి భూభాగ పరిస్థితులు, నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించే ప్రణాళికలను రచించడానికి తోడ్పడుతుందని చెప్పారు. జియో భూమిని సూచిస్తుందని, స్పేషియల్ అనేది భూమిపై ఉన్న వస్తువుల రేఖాగణిత లక్షణాలను సూచిస్తుందన్నారు. నిర్ణయం తీసుకోవడం, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ-మౌలిక సదుపాయాల ప్రణాళిక, హిమానీనద పర్యవేక్షణ, ఏడారీకరణ, అటవీ నిర్మూలన అధ్యయనాలు, కాలుష్య ట్రాకింగ్, సరిహద్దు నిఘా, సముద్ర భద్రతలో ఈ టెక్నాలజీ కీలకపాత్ర పోషించనున్నదని వివరించారు.
లాజిస్టిక్ కంపెనీలు తమ రవాణా మార్గాలను మెరుగుపర్చేందుకు, ఇంధన వినియోగం తగ్గించేందుకు సైతం ఉపయోగపడుతుందని చెప్పారు. 1957 నుంచి అంతరిక్ష శిథిలాలను తొలిగించడంలో అనేక వ్యయప్రయాసాలు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. అంతరిక్షంలో వ్యర్థాలు ఆందోళనకర స్థాయిలో పెరిగినట్లు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ అక్తర్ఖాన్ పాల్గొన్నారు.