దుబ్బాక, ఏప్రిల్ 8: వంటింట్లో గ్యాస్ మంట భగ్గుమంది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్యులు, పేదలపై మరింత భారం పడింది. ఓపక్క పెరిగిన నిత్యావసరాలతో కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు గ్యాస్ సిలిండర్ రూపంలో మరో పిడుగు వేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో అన్ని ధరలు ఆకాశన్నంటాయి. గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచి సామాన్యుల కేంద్రం నడ్డి విరిచింది.
సిలిండర్ ధర పెంపుతో సిద్దిపేట జిల్లా ప్రజలపై దాదాపు రూ.2 కోట్ల అదనపు భారం పడనుంది. మోదీ సర్కారు పేదలకు అచ్చేదిన్ అంటూనే సచ్చే దిన్‌గా మార్చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్ని ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో 3.12 లక్షల గ్యాస్ కనెక్షన్లు
సిద్దిపేట జిల్లాలో 3.12 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా 1700 టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతున్నది. ఒక కుటుంబానికి సగటునా ఏడాదికి 6-12 సిలిండర్లు వినియోగిస్తుంటారు. సిద్దిపేట జిల్లాలో 3.12 లక్షల మందికి (డొమెస్టిక్) గృహ అవసరాల కోసం గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 19 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సిలిండర్ ధర రూ. 50 పెంచడంతో జిల్లా ప్రజలపై రూ.1.60 కోట్ల భారం పడుతున్నది.
14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.50 పెంచడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 7 వరకు సిలిండర్ ధర రూ.874 ఉండగా, మంగళవారం (ఏప్రిల్ 8) నుంచి సిలిండర్‌పై రూ.50 కేంద్రం భారం మోపడంతో ధర రూ.924కు చేరింది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం గృహ అవసరాలకు(డొమెస్టిక్) వినియోగిస్తున్న సిలిండర్ ధర రూ. 924కు గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ చేస్తున్నాయి.
ఇబ్బందులకు గురిచేస్తుండ్రు..
పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారి రూ. 50 పెంచితే మేము ఎట్ల కొనాలి. ప్రభుత్వాలు పేదల గురించి ఫస్టు ఆలోచించాలి. అన్ని ధరలు పెరుగుతున్నయి.గిట్లయితే మేమెట్ల బతకాలి. ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలను పెంచడం బాధాకరం.
– సూరారపు వనజ, వినియోగదారు, లచ్చపేట
పేదల గురించి ఆలోచించడం లేదు..
పేదోళ్ల గురించి ఆలోచించే సర్కారు లేదు. ప్రజలను దోచుకునే ప్రభుత్వాలు తయారయ్యాయి. మాకు సొంతిళ్లు లేక అద్ద్దె ఇంట్లో ఉంటున్నాం. బయట కూరగాయలు, పండ్లు , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో ఇబ్బందిగా మారింది. పొద్దున లేస్తే గ్యాస్ పోయి వద్దకే పోవాలి. మాటిమాటికీ ధరలు పెరిగిపోవట్టే. ప్రభుత్వం సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.50 పెంచడం సరైంది కాదు. పెద్దోళ్లను వదిలేసి ప్రభుత్వం పేదోళ్లపై పడటం సమంజసం కాదు.
– కాయితి స్వరూప, వినియోగదారు, దుబ్బాక
కొనక తప్పదు..
పొయ్యి ముట్టించకపోతే ఇల్లు నడవదు. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచి మాలాంటి పేదోళ్లను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదు. రూ.924 తీసుకుని గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం పెందించిందని గ్యాస్ సిలిండర్ బాయ్ చెప్పాడు. రసీదులో కూడా రూ.924 ఉంది. సోమవారం వరకు సిలిండర్ రూ. 874 ఉండగా ఒక్కసారి రూ.50 పెంచారు.
– పాశికంటి విజయలక్ష్మి, వినియోగదారు, దుబ్బాక