న్యాల్కల్, ఏప్రిల్ 30: మండలంలోని రాఘవపూర్- హుమ్నాపూర్ గ్రామ శివారులోని సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రంలో జరుగుతున్న గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఆదివారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు పిల్లాపాపలతో భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, శివలింగంతో పాటు గంగామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో ఉత్తర భారతానికి చెందిన సాధువులు, సంతులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన స్వామీజీలు బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ మంజీరా నదిలో ప్రత్యేక అమృత స్నానాలు చేసి, మహా గంగా మహా హారతి చేశారు. అనంతరం ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీసాయిబాబా, వేంకటేశ్వర స్వామి, సూర్య భగవాన్, గంగామాత ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కుంకుమార్చన, అభిషేకాలు, పార్థీవ లింగార్చన, రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా, ఝరాసంగం మండలం బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ భక్తులకు ప్రవచనాలు వినిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
సెల్ఫీలతో సందడి
పంచవటీ క్షేత్రంతో పాటు మంజీరా నది తీరంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు తమ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చిన వారు పంచవటీ క్షేత్రంలోని నాగసాధువులు, సంతులతో ఆశీర్వదాలు తీసుకుంటూ, సెల్ఫోన్లలో ఫొటోలు దిగుతూ కనిపించారు. మంజీరా తీరంలో యువతీ యువకులు, చిన్నారులు స్నానాలు చేస్తూ విభిన్నంగా ఫొటోలు దిగుతూ మంజీరా కుంభమేళా జ్ఞాపకాలను తమతో తీసుకెళ్లారు.
Medak6
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
గరుడ గంగా పూర్ణ కుంభమేళాలో చండీయాగం, సంగీత కచేరి, కీర్తనలు, కూచిపుడి, పేరిణీ నృత్యాలు, పారాయణలతో భక్తులు ఆధ్యాత్మికంగా తన్మయత్వం చెందారు. ఉత్తర భారత దేశం నుంచి నాగసాధులు, సంతుల విన్యాసాలు, నృత్యాలు, మహారాష్ట్రకు చెందిన అక్కమహాదేవి భజన మండలితో పాటు విద్యార్థులు చేపట్టిన భజనలు, కీర్తనలు, శ్రీకృతి కూచిపుడి డ్యాన్స్ అకాడమీ, నృత్య ఆరాధన డ్యాన్స్ అకాడమీలకు చెందిన లలిత, రమేశ్, రాజేశ్, శీతల్ బృందం కూచిపుడి నృత్యాలు, సమ్మోహన డ్యాన్స్ అకాడమీకి చెందిన తోట ప్రశాంత్ బృందం పేరిణీ నృత్యాలు, పలు ప్రాంతాలకు చెందిన భజన మండలి సభ్యుల భజనలు, కీర్తనలు భక్తులను అలరించాయి. కుంభమేళాలో మంజీరా నది తీరంలో చేపట్టే మహా గంగా హారతిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ
కుంభమేళాకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండాసంబంధిత శాఖాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపారు. మంజీరా నదిలో స్నానాలు చేసే సమయం లో భక్తులు ప్రమాదాలకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్లతో పర్యవేక్షిస్తున్నారు. కుంభమేళా వేదిక ప్రాంతంలో భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పంచవటీ క్షేత్రం, మంజీరా నది తీరంలో చెత్తాచెదరాన్ని తొలిగిస్తూ పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Medak7