న్యాల్కల్, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని మంజీర నది తీరంలో గంగామాత అలయంతో పాటు రెండు కిలోమీటర్ల దూరంలోని పంచవటీ క్షేత్రంలో సిద్ధ సర్వస్వతీదేవి, షిర్డ్డీసాయిబాబా, సూర్యభగవాన్, భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించారు. నాలుగోసారి గరుడ గంగ పూర్ణ మంజీర నదికి కుంభమేళాను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్, పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 12 రోజల పాటు జరిగే కుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాగసాధువులు, దిగంబర సాధువులు, సంతులు, అఘోరాలు పెద్దఎత్తున తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వతీర్థాలు మంజీర నదిలో చేరుతాయని, ఆ సమయంలో శక్తిమంతులైన మహాపురుషులు, దేవతలు పక్షి రూపాలు ధరించి మంజీర నదిలో స్నానం చేస్తారని, అప్పుడు నదిలో స్నానం చేసినా, విశేషమైన హోమాలు చేసినా విశేష ఫలం కలుగుతుందని బ్రహ్మపురాణంలో పేర్కొన బడిందని కాశీనాథ్‌బాబా తెలిపారు. గంగానదికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహరాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్యలో గురుడు ఉండగా కృష్ణా నదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో.. మేషంలో సూర్యుడు ఉండగా మంజీర నదిలో ఒకసారి స్నానం చేసినా అంత ఫలం వస్తుందని, ఈ కుంభమేళాలో భాగంగా ఈనెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.
మంజీరా కుంభమేళాకు భారీగా భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో జహీరాబాద్ డీఎస్పీ రఘు పర్యవేక్షణలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సంగారెడ్డి ఆర్ఎం సుదర్శన్ ఆధ్వర్యంలో జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోలతో పాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.
మంజీరలో స్నానమాచరిస్తే పుణ్యం లోక కల్యాణం కోసమే గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళాను నిర్వహిస్తున్నాం. దేశ నలుమూలల నుంచి నాగసాధువులు, సంతులు, భక్తుల పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈనెల 24 నుంచి మే 5 తేదీ వరకు కుంభమేళా జరుగుతుంది. వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వ తీర్థాలు మంజీర నదిలో చేరుతాయి. కుంభమేళా వేళ మంజీర నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే మోక్షం లభిసుంది. వ్యాధులు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.
– కాశీనాథ్ బాబా, సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర పీఠాధిపతి, రాఘవాపూర్, న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా)
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
మంజీరా నదిలో గరుడ గంగ పూర్ణ కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు నదీతీరంలో విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నా. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
సమన్వయంతో ఏర్పాట్లు…
దక్షిణాదిలో మంజీరా నదిలో కుంభమేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్బాబు పర్యవేక్షణలో కుంభమేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
-మాల్కాపూరం శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా