నర్సాపూర్, జూన్ 29 : గబ్బర్‌సింగ్ సినిమాలో సైడ్ విలన్‌గా నటించిన నర్సాపూర్ మున్సిపల్ హనుమంతాపూర్ గ్రామానికి చెందిన నీరుడి వీరేశ్ (40) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే హనుమంతాపూర్ గ్రామానికి చెందిన నీరుడి వీరేశ్ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ సినిమాలలో సైడ్ విలన్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గబ్బర్‌సింగ్, రెబల్, చెన్నై ఎక్స్‌ప్రెస్(హిందీ), తడాఖా, అరవింద సమేతతో పాటు పలు సీరియల్లలో విలన్ పాత్ర పోషించాడు. గత రెండు సంవత్సరాలుగా పెరాలసీస్ వ్యాధితో బాధపడుతూ సొంత గ్రామానికి తిరిగి రావడం జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో హనుమంతాపూర్ గ్రామంలో కన్నుమూశారు. వీరేశ్ మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. హనుమంతాపూర్ గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. వీరేశ్‌కు భార్య శిరీష ఉన్నారు.