గజ్వేల్, డిసెంబర్ 1 : గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో ఫంక్షన్‌హాళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. గ్రామాల్లో శుభకార్యాలు, పెండ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా నిర్మించిన ఫంక్షన్‌హాళ్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో కోటి రూపాయలతో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామ సమీపంలోని పాఠశాల వద్ద ఫంక్షన్‌హాల్‌తో పాటు డైనింగ్, కిచెన్‌ను నిర్మించారు. కోటి రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించడంలో ఆసక్తి చూపించిన అధికారులు దానిని వినియోగంలోకి తీసుకురావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రారంభం నాటి నుంచి ఫంక్షన్‌హాల్‌కు తాళం వేసి ఉంచుతున్నారు.
పెండ్లిళ్ల సీజన్ కావడంతో గజ్వేల్‌లో ప్రైవేట్ ఫంక్షన్‌హాళ్లు దొరకడం సమస్యగా మారింది. దొరికినా ఎక్కువ డబ్బులు ఖర్చుచేయలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం కేసీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో గజ్వేల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో అందుబాటులోకి వచ్చినా అహ్మదీపూర్‌లో తాళం వేస్తున్నారు. పంచాయతీరాజ్, మండల పరిషత్ అధికారులు చొరవ తీసుకొని ఫంక్షన్‌హాల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.