హుస్నాబాద్‌టౌన్, జనవరి 7: అందరిలాగా ప్రైవేట్బడిలో చదువుకోవాలనే ఆశలు ఉన్నప్పటికీ పేదరికంతో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఆకుటుంబానిది. ఆ పరిస్థితులు ఆమెను సర్కారు బడివైపు తీసుకువెళ్లాయి.అలా సర్కారు ఉద్యోగాన్ని పొందేందుకు బంగారు బాటలు వేసుకున్నది. విద్యుత్‌శాఖలో హుస్నాబాద్ రూరల్ సబ్ ఇంజినీర్‌గా తాడూరి ప్రతిమ ఉద్యోగం సాధించింది.
పేదరికంలో ఉన్నా…
హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన తాడూరి లింగమూర్తి విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇందులో పెద్దకూతురు ప్రతిమ, రెండో కూతురు జాహ్నవి, కొడుకు అభిరామ్. కుటుంబాన్ని నెట్టుకురావడానికి కొన్ని సంవత్సరాలు పెయింటర్‌గా పనిచేసిన లింగమూర్తి ప్రస్తుతం హుస్నాబాద్‌లోని రిలయన్స్ మార్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లిసైతం హాస్టల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది.
చదవాలనే ఆశయం…
పెద్ద కూతురు ప్రతిమ పందిల్లలోని శ్రీవివేకానంద విద్యాలయంలో
ఐదోతరగతి వరకు చదివింది. అనంతరం ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆరోతరగతిలో చేరింది. అలా పదోతరగతి వరకు చదివిన ప్రతిమ మంచి మార్కులు సాధించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రులతో పాటు నానమ్మ సైతం ఎప్పుడూ చదవాలంటూ ప్రోత్సహించడంతో ఏదైనా సాధించాలని భావించింది. అలా సిద్దిపేట జిల్లా రాజ్‌గోపాల్‌పేట, చిన్నకోడూర్‌లో పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతిమ గత ఏడాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది.
తాడూరి ప్రతిమను సన్మానిస్తున్న ఎమ్మెల్యే
వొడితెల సతీశ్‌కుమార్
విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్‌గా..బీటెక్ పూర్తికాగానే విద్యుత్‌శాఖలో పోస్టులకు దరఖాస్తు చేసిన తాడూరి ప్రతిమ కొంతకాలం హైదరాబాద్‌లోని మెట్రోలో ఆపరేటర్‌గా పనిచేసింది. సబ్‌ఇంజినీర్ ఉద్యోగానికి పరీక్షలు రాయగా 2022 సెప్టెంబర్‌లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్‌గా ఎంపికైంది. నవంబర్‌లో ఉద్యోగంలో చేరిన ప్రతిమను అధికారులు హుస్నాబాద్ మండలంలోని హుస్నాబాద్ రూరల్ సబ్ ఇంజినీర్‌గా నియమించారు.
సమస్యలపై తక్షణమే స్పందిస్తా
విద్యుత్‌శాఖలో ఏమైనా సమస్యల గురించి ప్రజలు వస్తే తక్షణమే స్పందిస్తా. వారి విషయాన్ని పూర్తిస్థాయిలో విని నా చేతుల్లో ఉంటే సహాయం చేస్తా. తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ పనిచేయాలని భావిస్తున్నా. మంచి పేరుతెచ్చుకునేందుకు కృషిచేస్తా. లంచం తీసుకోవద్దని చెప్పిండ్రు. అలానే క్రమశిక్షణగా పనిచేసేందుకు కృషిచేస్తా.
-తాడూరి ప్రతిమ, సబ్ ఇంజినీర్, హుస్నాబాద్ రూరల్
ఆడపిల్లలు అని బాధపడ్డ..
నేడు గర్వంగా ఫీలవుతున్నా ఆడపిల్ల పుట్టింది ఎట్ల వీళ్లను సాదాలే అని బాధపడ్డ. కానీ పిల్లలను మంచిగ చదివించాలని అనుకున్నా. పెద్ద కూతురు ప్రతిమను ఐదో
తరగతి అయిపోయిన తర్వాత కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చేర్పించా. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుతుంటే సంబరమైంది. సదువే కాదు.. ఉద్యోగం కూడా సంపాదించింది.
– తాడూరి లింగమూర్తి, ప్రతిమ తండ్రి