Bhu Bharati Act | పాపన్నపేట, మే 25 : పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చెన్పల్లి తండాలో మే 24 , 25 తేదీలలో భూభారతి చట్టంపై అవగాహన, ఉచిత న్యాయ సహాయ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయవాది, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీకాంత్ తన సహచర హైకోర్టు న్యాయవాదుల సహకారంతో ఏర్పాటు చేశారు.
భూ భారతి చట్టం, రిజిస్ట్రేషన్, భూమి హక్కులు, కుటుంబ, సివిల్, క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పొడ్చన్ పల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబరు 1168, కొత్తపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 342లలో దాదాపు వందకుపైగా పేద గిరిజన రైతులు పాత పాసుపుస్తకాలను కలిగి ఉండి భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ, వారికి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో వారు రైతు భరోసా, రైతు బీమా వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ది పొందడంలో అనర్హులుగా పరిగణించబడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తపరిచారు.
కొంతమంది బాధితుల సమస్యలను న్యాయవాదులు ప్రో బోనో (ఉచితం)గా స్వీకరించి, వారికి న్యాయపరంగా సహాయం అందిస్తూ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరిగితే, ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెరిగి, న్యాయస్థానాలను ఆశ్రయించగల ధైర్యం కలుగుతుందని తెలిపారు. ఈ సహాయ శిబిరంలో తెలంగాణ హైకోర్టుకు చెందిన యువ న్యాయవాదులు నల్లపు మణిదీప్, వి.చంద్రకుమార్, బి.గణేష్ తదితరులు పాల్గొన్నారు.