సంగారెడ్డి, జూన్ 1 : ఖాతాదారులకు కొత్త పథకాలను అందించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఇంటింటికీ డీసీసీబీ కార్యక్రమాన్ని చేపట్టామని, నెల రోజుల్లో ఐదు లక్షల ఖాతాల నమోదుకు శ్రీకారం చుట్టామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో సీఈవో శ్రీనివాస్‌తో కలిసి డిపాజిట్ల సేకరణ పథకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఖాతాదారులకు డీసీసీబీ ఉత్తమ సేవలు అందిస్తూ తొలిస్థానంలో నిల్చిందని, నూతన పథకాలను ప్రవేశపెట్టి ఖాతాల నమోదుకు బ్యాంకు సిబ్బంది, అధికారులు ఇంటింటికెళ్లి డీసీసీబీ సేవలను వివరించి కొత్త ఖాతాలు తెరిపించాలన్నారు.
ఖాతాలు తీసుకున్న వారికి ఏడాదిపాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. డిపాజిట్లపై ఐదేండ్లలో డబుల్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని, ఇందులో చిన్నారులకు బచ్పన్ భరోసా పథకం, లక్షాధికారి పథకం, బంగారు ఆభరణాలపై రూ.20లక్షల వరకు రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఖాతాదారులు ఉచిత బీమా పథకాన్ని పొందేందుకు కేవలం బ్యాంకులో ఖాతా తీసుకుంటే సరిపోతుందని, ఏడాది అనంతరం తిరిగి బీమా పథకాన్ని పొడిగించుకోవాలన్నారు. డీసీసీబీ అందించే సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సూచించారు. కార్యక్రమంలో జీఎం పురుషోత్తంరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.