
జహీరాబాద్, జనవరి 1 : కొత్త సంవత్సరం మొదటి రోజు నలుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కారు బైక్ ఢీ కొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృత్యువాత పడ్డాడు. బతుకుదెరువు కోసం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ బట్టలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ ఎస్సై రవి కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన మోతి బాల్‌రాజ్ (28), అతడి భార్య శ్రావణి (22), కూతురు అమ్ములు (8 నెలలు) పట్టణంలోని గాంధీనగర్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. బతుకుదెరువు కోసం ఊరూరూ తిరుగుతూ బట్టల వ్యాపారం చేసేశారు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే బట్టలు విక్రయించేందుకు కూతురుని తీసుకుని భార్యాభర్త బైక్‌పై బీదర్‌కు వెళ్తున్నారు. దిడిగి గ్రా మం వద్దకు రాగానే అదే సమయంలో అటునుంచి జహీరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో డ్రై వింగ్ చేస్తున్న వికారాబాద్ జిల్లా పట్లూర్ గ్రామానికి చెందిన ఫరీద్ (28) సైతం ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఫరీద్‌తో పాటు కారులో ఉన్న దిగ్వాల్ గ్రామానికి చెందిన మక్సూద్ స్వల్పగాయాలతో బయటపడగా, చికిత్స నిమిత్తం జహీరాబాద్ దవాఖానకు తరలించారు. కాగా, పోస్టుమార్టం నిమి త్తం నలుగురి మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై రవి తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, కారును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.