సంగారెడ్డి, జనవరి 30: జిల్లా కేంద్రం గ్రేడ్-1 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, గెలిచే వారికే టికెట్లు ఇచ్చామని సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి పట్టణ మున్సిపల్ సమన్వయ కర్త కడవేర్గు రాజనర్సు, సోమిరెడ్డితో కలిసి ప్రకటించారు.
ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 38 వార్డులకు 32వార్డుల అభ్యర్థులను ప్రకటించామని, మిగతా ఆరు వార్డుల్లో పోటీ పడుతున్న అభ్యర్థులతో చర్చంచి గెలుపు సత్తా ఉన్న వారికి టికెట్ ఇస్తామన్నారు. ఆయా వార్డుల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులపై సర్వే చేయించి గెలిచే వారికే పార్టీ బీ-ఫామ్స్ ఇస్తామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు 40 శాతం పైగా సర్పంచ్‌లుగా గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతుందన్నారు. టికెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలని కోరారు. టికెట్రాని నాయకులు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సహించేదిలేదన్నారు. సమావేశంలో పట్టణ ఎన్నికల సమన్వయ కర్త కడవేర్గు రాజనర్సు, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.