కల్హేర్, నవంబర్ 23: గత యాసంగిలో నల్లవాగు ప్రాజెక్టు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకూ నీరందించిందని, ప్రస్తుత యాసంగిలో కూడా ప్రతి ఎకరాకూ నీరందించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని ఖానాపూర్ (కే)లో విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో 4వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటితో 6,200 ఎకరాలకు సాగు నీరందించవచ్చన్నారు. బీఆర్ఎస్ హయాంలో కుడి, ఎడమ, ఎమర్జెన్సీ కాల్వల కింద వానకాలం, యాసంగి డీ సిల్లింగ్ తీయించి రెండూ పంటలకూ సాగునీందించామని తెలిపారు.
కాల్వల ప్రస్తుత దుస్థితిలో సాగునీరు పంట పొలాలకు పారడం కష్టమేనన్నారు. నీరు వదలక ముందు కాల్వల్లోని పూడికను తొలిగించాలని ఆయన సూచించారు. వానకాలం, యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన సన్న, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బసవేశ్వర లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు బసవేశ్వర లిఫ్టు ఇరిగేషన్ పనులను నిలిపివేసిందని ఆరోపించారు.
నల్లపోచమ్మ లిఫ్టు ఇరిగేషన్ గతంలోనే ప్రారంభించారని, తిరిగి రూ.కోట్లతో ప్రారంభించడం కాంగ్రెస్ నాయకులకు కల్పతరువుగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తరుగు 2 కిలోలు తీస్తే దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని, ఇప్పుడూ తరుగు 2 కిలోలు తీస్తున్నారు కాదా మీరు దోపిడీ చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. క్రాప్ హాలిడే ఇచ్చి కాల్వల నిర్మాణం పనులు సగం పూర్తి చేశారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను గంగాళంలా మార్చడంతో గొలుసుకట్టు కాల్వలతో పంట పొలాలకు నీరు అందించడంలో నియోజకవర్గంలో పంటలు సమృద్ధిగా పండాయని పేర్కొన్నారు.
కక్ష సాధింపు చర్యలతో కల్హేర్, మార్డి గ్రామాల్లోని పీఏసీఎస్‌లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మంజూరు చేయలేదని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు, బోరుబావుల కింద పూర్తిస్థాయిలో సాగు కాలేదని, సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. చాలామంది రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని రైస్ మిల్లులకు అమ్ముకున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇకనైనా రైతు భరోసా అందించి రూ. 2 లక్షలు వరకు పంట రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశంలో మాజీ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు రాంసింగ్, జడ్పీ, మండల కోఆప్షన్ మెంబర్లు అలీ, ఘనీ, కల్హేర్, మార్డి పీఏసీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, వెంకట్, మాజీ ఎంపీటీసీ సంగప్ప, మాజీ బీసీసెల్ అధ్యక్షుడు సాయిగొండ, నాయకులు జనార్దన్ సార్, రాములునాయక్, సంగయ్య, నర్సింహులు, విఠల్, గోపాల్‌రెడ్డి, నర్సింహ గౌడ్, మోహన్ సాగర్, నాగ్నాథ్, పీరయ్య, మంద నారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, పండరి, సంగమేశ్వర్, మాణిక్‌ప్రభు, అంజిగొండ, సాయిరాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.