నంగునూరు, జూన్ 8: సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ దిగుబడి ఆరంభమైంది. ఆయిల్‌పామ్ తొలి పంట తీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాలో సుమారు 11 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహాన్ని అందించింది. ప్రభుత్వపరంగా అనేక రాయితీలు కల్పించి రైతులను ఆయిల్‌పామ్ సాగు చేసుకునే విధంగా అన్నిరకాలుగా ప్రోత్సాహకాలు అందించింది.
మండల పరిధిలోని నర్మెటలో 65 ఎకరాల్లో రూ.300 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మించనుంది. పనులు సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీమంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని సిద్దిపేట జిల్లాలో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉండే ఆయిల్‌పామ్‌ను సాగుచేసేందుకు గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ప్రోత్సహించారు. దాని ఫలితంగా ఆదివారం ముందుగా వేసిన ఆయిల్‌పామ్ తోటల్లో తొలి ఆయిల్‌పామ్ గెలలను తీసే కార్యక్రమాన్ని అక్కెనపల్లి గ్రామంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
నంగునూరు మండలంలో మొత్తం 493 మంది రైతులు 1,669 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. ముందుగా అక్కెనపల్లిలో 26 మంది రైతులు సుమారు 168 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. గ్రామానికి చెందిన రైతు నాగేందర్ తోటలో తొలి గెలలు తీసేందుకు సిద్ధం చేశారు. ఈమేరకు ఆదివారం మాజీమంత్రి హరీశ్‌రావు తొలి గెలలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 415 ఎకరాల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మాది అక్కెనపల్లి గ్రామం. మాజీ మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు 7 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశా. పంట వేసిన తర్వాత మొదటిసారి గెలలు చేతికి రానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు అనేక రకాలుగా రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించింది. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– తిప్పని నాగేందర్, ఆయిల్‌పామ్ రైతు, అక్కెనపల్లి గ్రామం, సిద్దిపేట జిల్లా