సిద్దిపేట టౌన్, మే 21: సనాతన ధర్మం ఎంతో గొప్పదని, నిర్మలమైన మనస్సు.. నిశ్చలమైన దీక్షతో భగవంతుడిని కొలిస్తే అంతా మంచి జరుగుతుందని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని మోహిన్‌పురా వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మహా కుంభాభిషేకం మహాఘట్టం వైభవంగా నిర్వహించారు. చినజీయర్ స్వామితో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చినజీయర్ స్వామి ప్రవచనాలు ఇస్తూ.. మానవుడు ఆ భగవంతుడికి కృతజ్ఞతగా ఉండాలన్నారు.
సిద్దిపేట నడిబొడ్డున 50 ఏండ్ల క్రితం పెద్దజీయర్ స్వామి చేతుల మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రతిష్ఠించబడి, ఈ ప్రాంత ప్రజలను వేంకటేశ్వర స్వామి చల్లగా చూస్తున్నాడన్నారు.సనాతన ధర్మాన్ని అందరూ పాటించాలని, ధర్మాన్ని మనం కాపాడితే.. మనల్ని ధర్మం కాపాడుతుందని అన్నారు. హరీశ్‌రావు ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని చినజీయర్ స్వామి కొనియాడారు. హరీశ్‌రావు ప్రజా నాయకుడని, ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, సిద్దిపేటను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారని చినజీయర్ స్వామి అభినందించారు.
ఆధ్యాత్మిక.. ధార్మికతకు నెలవు సిద్దిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆధ్యాత్మికత, సేవాపరులకు నిలయంగా సిద్దిపేట విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆనాడు పెద్ద జీయర్ స్వామి పెట్టిన ముహూర్తమే నేడు స్వర్ణోత్సవ సంబురానికి వేదికైందన్నారు. ఆలయ వేడుకకు చినజీయర్ స్వామి రాకతో సిద్దిపేట పునీతమైందన్నారు. చినజీయర్ స్వామితో ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారితో తమకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. బ్రహోత్సవాలకు స్వామి వారు మూడు రోజుల సమయం ఇవ్వడం మనందరి అదృష్టమని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీయర్ స్వామి మాట్లాడుతుంటే భగవద్గీతను చదివినట్లుగా.. రామాయణాన్ని విన్నట్లుగా ఉంటుందన్నారు.
ఈ ఆలయం ప్రతిష్ఠించినప్పటి నుంచి నేటి వరకు నిత్య పూజలు చేయడం ఆషామాషి విషయం కాదని, ఏడుకొండల వెంకన్న స్వామి కృపా కటాక్షాలతోనే ఇది సాధ్యమైందన్నారు. జీవితంలో ఎంత ఎదిగినా దేవుడి సేవలోనే తృప్తి లభిస్తుందన్నారు. అన్నదాన సత్రానికి అవసరమైన గ్రానైట్‌ను త్వరలోనే అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో చినజీయర్ స్వామి శిష్యబృందం, ప్రజాపతినిధులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.