గజ్వేల్, సెప్టెంబర్ 13: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణలో ఉద్యమం నాటి రోజులు వస్తాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న సందర్భంగా గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. పోలీస్‌లను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నదని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, నాయకులు ఎన్సీ సంతోష్‌గుప్త, రవీందర్, నర్సింగరావు, స్వామిచారి, చందులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. మాజీ జడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షు డు నవాజ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.