పాపన్నపేట, అక్టోబర్ 5: వరద బీభత్సం సృష్టించడంతో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా ఆలయానికి కనీవినీ ఎరగని రీతిలో సుమారు కోటి రూపాయల నష్టం సంభవించింది. ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్, జనరల్, వీఐపీ క్యూలైన్స్, మంటపం రేకులు వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆలయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆలయ అధికారులు సరైన సమయంలో స్పందించి గ్రిల్స్ తొలిగించి ఉంటే ఆలయానికి ఇంత నష్టం జరగకుండా ఉండేదని పలువురు భక్తులు పేర్కొన్నారు.
ఆలయ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా విధులకు హాజరుకావడమే కాకుండా ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోకపోవడంతో భారీ నష్టం సంభవించిందని భక్తులు ఆరోపిస్తున్నారు. నిజానికి వాతావరణ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు భారీ వర్షాలు సంభవిస్తాయని ముందస్తుగా హెచ్చరించారు. దీంతో సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు పెద్దఎత్తున నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తారనే ముందస్తు సూచనలు చేసినప్పటికీ, ఏడుపాయల ఆలయ అధికారుల నిర్లక్ష్యమా..
అలసత్వమో కానీ ఆలయ మంటపానికి తొలిగించాల్సిన గ్రిల్స్ అలాగే ఉంచడంతో వరద ఉధృతికి అవి విరిగి వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో కోటి రూపాయల నష్టం సంభవించిందని ఆలయ ముఖ్య ఉద్యోగి ఒకరు వెల్లడించారు. వర్షాకాలంలో వరద ఉధృతి దృష్ట్యా నాలుగేండ్ల నుంచి ఆలయ మంటపానికి నష్టం వాటిల్లకుండా, గ్రిల్స్ దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని తొలిగించి మళ్లీ అమరుస్తున్నారు.
గతంలో అలా.. ఇప్పుడు ఇలా..
ఆలయ గత ఈవో సారా శ్రీనివాస్ గ్రిల్స్ అవసరాన్ని బట్టి విప్పించి, భద్రపరిచి మళ్లీ ఏర్పాటు చేసేలా గ్రిల్స్‌కు పట్టాలను, నట్ బోల్ట్లను ఏర్పాటు చేయించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేవారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్దఎత్తున నీరు వదిలినప్పుడు ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్ తొలిగించి భద్రపరుస్తూ ఉండేవారు. మళ్లీ వరదలు తగ్గిన వెంటనే వాటిని తిరిగి ఆలయ మంటపానికి బిగించేవారు. ఈసారి ఆగస్టు 12న సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెద్దఎత్తున నీరు వదులుతున్నట్లు ముందే సంబంధిత శాఖ అధికారులు సమాచారం అందించారు.
అయినప్పటికీ ఏడుపాయల ఆలయ అధికారులు కేవలం హుండీలను ఆలయం నుంచి తొలిగించి భద్రపరిచారే తప్ప ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్ తొలిగించలేదు. దీంతో ఆగస్టు 14న 52 రోజుల పాటు ఆలయం మంజీరా ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రెండు రోజుల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఆలయం జలదిగ్బంధం నుంచి బయటపడింది.
ఆదివారం ఆలయ సిబ్బంది ఆలయానికి వెళ్లి పరిశీలించగా, పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఆలయాన్ని శుద్ధిచేసే పనిని ప్రారంభించారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆలయ మంటప గ్రిల్స్ వరద తాకిడికి ధ్వంసం అయ్యాయని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షల రూపాయల నష్టం జరిగిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.