మెదక్, జూలై 21(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కొల్చారం మండ లం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మారెల్లి అనిల్ హత్య కేసు మిస్టరీ వీడింది. భూవివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇతరత్రా కారణాలతోనే అనిల్‌ను నిందితులు కాల్చి చంపినట్టు మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఆయన వెల్లడించారు. ఎస్పీ వివరాల ప్రకారం… మారెల్లి అనిల్‌ను ఈనెల 14న రాత్రి 8 గంటలకు వరిగుంతం సబ్‌స్టేషన్ సమీపంలో దుండగులు కాల్చిచంపారు. ఈ హత్యపై కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు విచారణకు ఏడు ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటు చేశారు.
అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైతో విచారణ చేపట్టారు. హత్య కేసులో ఏ1గా పైతర గ్రామానికి చెందిన సోమన్నగారి రవీందర్‌రెడ్డి, ఏ2గా రంగంపేటకు చెందిన పడేపు నాగరాజు, ఏ3గా రంగంపేటకు చెందిన పడేపు నాగభూషణంతో అనిల్‌తో శత్రుత్వం ఉంది. రవీందర్‌రెడ్డి, భార్య లక్ష్మీకి అనుచరుడిగా అనేక సంవత్సరాలు అనిల్ పనిచేశాడు. మే 13, 2021 కరోనా సమయంలో లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా రవీందర్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్నాడు. అనంతరం అనిల్, రవీందర్‌రెడ్డి మధ్య పెట్రోల్ బంక్‌తో పాటు భూవిషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో రవీందర్‌రెడ్డి అనిల్‌పై కోపం పెంచుకున్నాడు.
ఈ విషయాన్ని సన్నిహితుడైన నాగరాజుతో చర్చించాడు. రవీందర్‌రెడ్డి భార్య సంవత్సరికం కార్యక్రమానికి అనిల్ తన గ్యాంగ్‌తో తాగి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడంతో నాగరాజు, రవీందర్‌రెడ్డి అతని తీరుపై ఆగ్రహానికి గురయ్యారు. ఏ2గా నాగరాజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు అనిల్, అతని అనుచరులు నాగరాజును అవమానించి, గెలిపించమని చెప్పారు. రంగంపేటలో రవీందర్‌రెడ్డి ఇంటికి సంబంధించిన ప్లాట్‌ను నాగరాజు అమ్మకుండా అనిల్ అడ్డగించాడు. నాగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దు చేయించాడు. ఏ3గా ఉన్న నాగభూషణం నుంచి రూ.6 లక్షలు అనిల్ రుణంగా తీసుకుని చెల్లించలేదు. నాగభూషణంకు ఉన్న అనారోగ్య సమస్యలను బహిరంగంగా చెబుతానని అనిల్ బ్లాక్మెయిల్ చేశాడు. వీటన్నింటి కారణంగా అనిల్ హత్యకు ప్లాన్ చేశారు.
ఈ కేసులో ఈ ముగ్గురు ప్రధాన నిందితులు….
అనిల్‌ను హత్యకు పక్కా ప్లాన్ వేశారు. ఏ2 నాగరాజు పక్కా ప్లాన్‌తో ఏ5గా ఉన్న ఫరీద్ తనకు పరిచయం ఉన్న బీహారుకు చెందిన వ్యక్తి సచిన్‌కుమార్ దగ్గరకు జూన్ 27న హైదరాబాద్ నుంచి పాట్నాకు ఇండిగో విమానంలో వెళ్లాడు. అక్కడ నవాబ్‌గంజ్‌కు వెళ్లి అక్కడ సచిన్ కుమార్‌కు రూ.1.50 లక్షలు చెల్లించి ఒక తుపాకీ కొన్నారు. అక్కడి నుంచి బీహారులోని దానాపూర్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో తెలంగాణలోని జమ్మికుంట రైల్వేస్టేషన్లో దిగాడు. పోలీసుల తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో ఈ రైల్వేస్టేషన్ ఎంచుకున్నాడు. అక్కడి నుంచి అతన్ని నాగరాజు ఓ కారులో ఎక్కించుకొని మేడ్చల్‌లోని గ్యారేజ్‌కు వచ్చి, కొద్దిరోజులు పిస్టల్ ఉపయోగించడంలో తర్ఫీదు తీసుకున్నారు. అనంతరం ఈనెల 13న నాగరాజు, షబుద్దీన్, చిన్నా డీసీఎంలో మేడ్చల్‌లోని గ్యారేజ్ నుంచి బయలుదేరారు.
కౌడిపల్లి నుంచి కిష్టాపూర్, రాంపూర్ మధ్యలో డీసీఎంను పార్కింగ్ చేశారు. 14న అనిల్ హైదరాబాద్‌కు వెళ్తున్నాడని నిందితుడు ఫరీద్ సమాచారం ఇచ్చాడు. అనిల్ మార్గమధ్యలో తన అనుచరుడైన శేఖర్‌ను తీసుకొని బయలుదేరాడు. మృతుడు అనిల్ గాంధీ భవన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నట్టు గమనించిన నిందితులు అనిల్ కారును వెంబడించారు. మార్గమధ్యలో కౌడిపల్లిలో అనిల్ శేఖర్‌ను, బాలేశ్ను అప్పాజిపల్లిలో దించేశాడు. ఆ తర్వాత నిందితులు అనిల్‌ను హత్య చేయాలని ప్రయత్నించారు. కానీ, అప్పటికే పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడ కుదరకపోవడంతో వరిగుంతం శివారులో సబ్‌స్టేషన్ సమీపంలో నాగభూషణం తన మారుతి కారుతో అనిల్ వాహనాన్ని అడ్డగించాడు.
మరో కారు స్విఫ్ట్ డిజైర్ వెనుక ఆగింది. ఏ4 షబుద్దీన్ కారులో నుంచి దిగి తన వద్ద ఉన్న పిస్టల్‌తో అనిల్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కారు ఎక్స్లెటర్ నొక్కినప్పుడు నియంత్రణ కోల్పోయి రోడ్డుకు ఎడమ వైపు వెళ్లి విద్యుత్ సబ్‌స్టేషన్ గేటును ఢీకొన్నాడు. అనిల్ వద్ద డబ్బును తీసుకొని దొంగతనం, ఆర్థిక హత్యగా చేసే ప్రయత్నం చేశారని మెదక్ ఎస్పీ తెలిపారు. నిందితులు ఉపయోగించిన కార్లతో పాటు పిస్టల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 103(1), ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్లు 25(1), 27 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరందర్గౌడ్, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, వెంకట్‌రాజుగౌడ్, జాన్‌రెడ్డి, రంగ కృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. నిందితులను పట్టుకున్న అదనపు ఎస్పీ మహేందర్‌తో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. రివార్డులు ప్రకటిస్తామని తెలిపారు.