చేర్యాల, మార్చి 4: విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యం నిర్దేశించుకొని ఏకాగ్రత, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సినీ నటుడు, నంది అవార్డు గ్రహీత, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ కేవీ ప్రదీప్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మంగళవారం చేర్యాల శృంగేరి నగర్లోని సద్గురు సదనంలో శారదా సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవీ ప్రదీప్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అవకాశం, ఆత్మవిశ్వాసం అనే రెండు రెక్కలను ఉపయోగించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమ్మలాలన, మల్లెల వాసన, మట్టి వాసన, చంద్రుని వెన్నెల వంటివి అనుభవిస్తేనే వాటి గొప్పతనం తెలుస్తుంద న్నారు. మొబైల్ జీవితంలో భాగమైందని, కానీ.. మంచి పనుల కోసం, పరిమితిమేర దానిని వినియోగించుకుంటే జీవితం బాగుంటుందని సూచించారు. విద్యార్థులు, యువత భావిభారత నిర్మాతలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సద్గురు సదనం నిర్వాహకులను కేవీ ప్రదీప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సద్గురు సదనం నిర్వాహకులు మాట్లాడుతూ.. నువ్వు నీకే కాదు, సమాజానికి సాయం చేయి అన్న లక్ష్యంతో సద్గురు సదనం పనిచేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో గుణాత్మక మార్పునకు విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాసర సరస్వతి ఆలయంలో పూజ చేయించబడిన ప్యాడ్స్, పెన్నుల సెట్లను సదనం నిర్వాహకులు విద్యార్థులకు అందజేశారు.