సంగారెడ్డి, జనవరి 17 : జిల్లా చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా తొలగించి అన్నదాతలకు తీపి కబురు అందించేందుకు సీడీసీ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో చెరుకు పంట సాగుపై పరిశీలన చేశారు. సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు నాలుగు రాష్ర్టాలు (కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి)ల్లో పర్యటన చేయనున్నారు. మంగళవారం వనపర్తి జిల్లా రామకృష్ణుర్ కొత్తకోట ఎన్ఎస్ఎల్ కృష్ణవేణి షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీని సందర్శించారు.
ఆ ఫాక్టరీలో రోజుకు 3500 టన్నుల చెరుకును గానుగ ఆడించే విధానం వివరాలను యాజమాన్యంతో మాట్లాడి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ లేబర్ ట్రాన్స్‌పోర్ట్‌ను అన్నదాతలకు యాజమాన్యం అందించడం గొప్ప విషయమన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో రైతులను పలకరిస్తూ సాగు విధానంపై సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ చెరుకుపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన తక్కువగా ఉంటుందన్నారు. ఇక్కడి రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతుండడం సంతోషకరమన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు పక్కన ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన ముగించుకుని కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. కర్ణాటకలోని చాముండేశ్వరి షుగర్స్ లిమిటెడ్ భారతీనగర్ దొడ్డి మండ్యకు బయలుదేరామని చెప్పారు. అక్కడ పండించే చెరుకు సాగు విధానాన్ని మన జిల్లాలో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వం చెరుకు పంటల సాగుకు రైతులకు భరోసా కల్పిస్తే పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రోత్సహించేందుకు సీడీసీ చైర్మన్లకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఈ బృందంలో డైరెక్టర్ జైపాల్ నాయక్, ఫీల్డ్‌మెన్ మాణిక్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు శంకర్‌గౌడ్, అనంతరావు కులకర్ణి, ప్రభు, శేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనంతరెడ్డి, వెంకట్ నరసింహరెడ్డి, మొగులయ్య, వీరప్ప, శంకర్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, శశికాంత్, చంద్రశేఖర్ ఉన్నారు.