సిద్దిపేట, మార్చి 18: నీళ్లు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలా లు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు సిద్దిపేట- కామారెడ్డి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సిద్దిపేట రూరల్ మండలంలోని మాచాపూర్లోని దిగువన ఉన్న రైతుల పంట పొలాలకు రంగనాయక సాగర్ ద్వారా గతంలో సాగునీటిని అందించేవారని, కొన్ని రోజులుగా భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరులేక తమ పంట పొలాలు ఎండుతున్నాయని, వెంటనే తమకు రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలాలు అందించాలని కోరారు. ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
తమ పంట పొలాలను రక్షించుకోవడం కోసం గత్యంతరం లేని పరిస్థితిలోనే తాము రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయాల్సి వచ్చిందని వాపోయారు. తాము ఇరిగేషన్ అధికారులను అడిగితే కోదండరావుపల్లి, బంజేరుపల్లి గ్రామాలకు ఇచ్చిన తర్వాతనే తాము మాచాపూర్కు నీటిని ఇస్తామని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు అకడికి చేరుకొని సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు.