అందోల్, మే 26: జీలుగ విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారం రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండగా ఆలస్యంగా విత్తనాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తనాల కోసం కొన్నేండ్లుగా కనబడకుండా పోయిన పాస్బుక్కుల క్యూలైన్లు మళ్లీ దర్శనమిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీకి వ్యవసాయ అధికారులు పర్మిట్లు ఇచ్చేందుకు సిద్ధం కాగా, భారీగా రైతులు తరలి వచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో రైతులు పాస్బక్కులను క్యూలో పెట్టి నిరీక్షించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమకు సరిపోను విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదన్నారు. తొలిరోజే తమకు సరిపోను విత్తనాలు అందలేదన్నారు. విత్తనాలు సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. గతేడాది ఒక్కో బస్తా రూ. 1140కి ఇచ్చారని ..ఇప్పుడూ రూ. 2137.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీహరి మాట్లాడుతూ.. రైతులకు సరిపోను విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ ఒకేసారి రావడంతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. సోమవారం 300 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయని, రైతులందరికీ అందజేస్తామన్నారు.
విత్తనాల కోసం ఉదయం నుంచి కార్యాలయం వద్దకు వచ్చి పాస్‌బుక్కులు క్యూలో పెట్టి నిలబడ్డాం. అయినా విత్తనాలు దొరకడం కష్టంగా మారింది. ఒక్క ఎకరాకు ఒక బ్యాగు ఇచ్చే అధికారులు 2.5 ఎకరాలకు ఒక బ్యాగు ఇస్తామని చెప్పారు. అది కూడా సబ్సిడీ ఇవ్వడంలేదు. గతేడాది రూ. 1140కి ఇస్తే ఇప్పుడూ రూ. 2137.50 ఒక బ్యాగు ఇస్తున్నారు. ఇంకా సబ్సిడీ ఎక్కడ ఇచ్చినట్లు. ప్రభుత్వం రైతులను ఎక్కడ ఆదుకున్నట్లు. ఓ పక్క వడ్లు వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతుంటే ..మరో వైప్తు విత్తనాల పంపిణీలో ఇబ్బందులు పడుతున్నాం.
-బీరప్ప, రైతు. ఎర్రారం