చిన్నకోడూరు, జూన్ 2: రోడ్డెకే పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రామంచ రైతులు మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచలోని సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చంద్రమోహన్ అకడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తే తప్పా అధికారులు స్పందించిన దాఖలాలు లేవన్నారు. సేకరించిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలన్నా రోడ్డెకే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మారెట్కు తీసుకువచ్చి 40 రోజులు గడుస్తున్నా ధాన్యం సేకరించడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.