వెల్దుర్తి, ఏప్రిల్ 29: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం తూకం వేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్దుర్తి మండలంలోని (Veldurthy) ఉప్పు లింగాపూర్ రైతులు వెల్దుర్తి- మెదక్ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉప్పు లింగాపూర్‌లో అధికారులు ఈనెల 17న కొనుగోలు కేంద్రం ప్రారంభించారని, అంతకు ముందు సుమారు 20 రోజుల నుంచి వరి కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోశామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినా ధాన్యం తూకం వేయకపోవడంతో అకాల వర్షాలు ఈదురు గాలులతో ధాన్యం తడిసి ముద్ద అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకం ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సంఘం అధికారులు, సిబ్బందిని వేడుకున్నా హమాలీలు రావడం లేదని తెలిపారన్నారు.
దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద పోసుకొని ధాన్యం రాశులు అరిగోస పడుతున్నామని చెప్పారు. సోమవారం రాత్రి గ్రామానికి వచ్చిన హమాలీలను పీఏసీఎస్ సిబ్బంది బండ పోసానిపల్లికి తరలించారు. ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని సహకార సంఘం సిబ్బందిని కోరినా స్పందించలేదన్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించామన్నారు. విషయం తెలుసుకున్న సహకార సంఘం సిబ్బంది, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి హమాలీలను వెనక్కి రప్పించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.