చౌటకూర్, మే 13: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైఠాయించారు. ధా న్యాన్ని తూకం వేయడంలో డీసీసీబీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. హమాలీలు సరిపడా లేక కొనుగోళ్లలో జాప్యం చేస్తుండడంతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని రైతులు ఆక్రోశం వెళ్లగకారు.
కోర్పోలు గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో సుల్తాన్‌పూర్‌కు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించి గంట పాటు నిరసన తెలిపారు. గ్రామంలో ధాన్యం కొనుగోళ్లకు రెండు కేంద్రాలు అవసరం ఉండగా, డీసీఎంఎస్ అధ్వర్యంలో ఒక కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, ఫలితంగా కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయకుండా టోకెన్లు జారీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. రాస్తారోకో చేస్తున్న రైతులతో జోగిపేట సీఐ అనిల్‌కుమార్ మాట్లాడి నచ్చజెప్పేందుకు యత్నించారు.
అటు వైపు వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ పాండు రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఇన్చార్జి వంశీ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని అదనపు కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేవారు. రెండు, మూడు రోజుల్లో హమాలీలను సమకూర్చి ధాన్యం తూకం వేయిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దాదాపు గంట పాటు రాస్తారోకో చేపట్టడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పాలిసెట్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్న విద్యార్థులు చికుకోవడంతో సీఐ అనిల్‌కుమార్ నచ్చజెప్పి పంపించారు.
