మునిపల్లి,నవంబర్ 8: రైతులు పడుతున్న కష్టాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్ మండలం కంకోల్ గ్రామ శివారులోని డెక్కన్ టోల్‌ప్లాజా వద్ద రైతులకు అండగా బీఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులు శనివారం మహాధర్నాలో పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
ఏడాది పాటు పండించిన పంటను అమ్ముకునేందుకు కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు పెట్టిన పలు రకాల నిబంధనలతో పత్తి రైతులు పం డించిన పంటను అమ్ముకునేందుకు భయపడుతున్నారన్నారు.రైతులకు పెట్టిన నిబంధనలు పూర్తిగా తొలిగించాలని డిమాండ్ చేశారు. మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్పందించి నిబంధనలు తొలిగించాలని లేకుంటే రైతులతో కలిసి ఢిల్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన నిబంధనలు తొలిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్ మాట్లాడుతూ కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. బీఆర్ఎస్ మునిపల్లి మండల నాయకులు,కాంగ్రెస్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.