సిద్దిపేట, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల కోసం పల్లె నుంచి జిల్లా వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ ఏకమయ్యారు. తెలంగాణ రైతుల గోసను ఢిల్లీకి వినిపించేందుకు నడుం బిగించారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు, సహకార సంఘాల నుంచి బల్దియాల వరకు ప్రజాప్రతినిధులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పోస్టుల్లో వాటి ప్రతులు పంపుతున్నారు. తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనాలని అందులో డిమాండ్ చేస్తున్నారు. తీర్మానాలు చేసి పంపే ప్రక్రియ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 70శాతం చోట్ల పూర్తయ్యింది. వారికి నాయకులు, రైతులు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. కేంద్ర సర్కారు ఇలాగే వ్యవహరిస్తే ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసేలా టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వివిధ రూపాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పంపుతున్నారు. ఈ ప్రక్రియలో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. వారి కి నాయకులు, రైతులు, రైతుసంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. కొన్ని గ్రామాల్లో బీజేపీ సర్పంచ్లు ఉన్న చోట సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తీర్మానం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రైతులతో పాటు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. రైతుల పక్షాన నిలబడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి పోస్టు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆహార మంత్రికి పంపారు. మండల పరిషత్, సహకార సంఘాల్లో సైతం మెజార్టీ వాటిలో తీర్మానాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసేదాక తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. రైతులను చులకన చేసిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తుంటే, కేంద్రం రైతులపై క్షక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
దీంతో ఈ యాసంగిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 2,40,350 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,67,275 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,37,100 ఎకరాల్లో సాగైంది. ఈ ప్రాంతంలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ప్రతి రైతు కూడా వరి సాగుచేస్తుంటారు. ఇన్నాళ్లు సాగునీరు లేక పంటలు పండలేదు. వలస పోయిన రైతాంగం, సాగునీరు రావడంతో ఊరికి వచ్చి పంటలు పండించుకుంటున్నారు. చేతినిండా పనిదొరుకుతున్నది. బంగారు పంటలు పండుతున్నాయి. రైతులు సంబురపడుతున్న ఈ సమయంలోనే కేంద్రం తెలంగాణ రైతులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నది. ఉగాది పండుగలోపు కేంద్రం ధాన్యాన్ని తీసుకుంటామని ప్రకటన చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రైతుల కోసం ఎంతటి ఉద్యమం, త్యాగానికైనా వెనుకాడమని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి
ధాన్యాన్ని కేంద్ర ప్రభు త్వం కొనుగోలు చేయాలి. రైతులు పండించిన ధా న్యాన్ని పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకూ పోరాటం చేస్తాం. రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రం వ్యవహరించడం సరికాదు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రం ఇప్పటికైనా రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలి.
–రైతు చంద్రశేఖర్రెడ్డి, చండూర్, చిలిపిచెడ్ మండలం
తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి..
తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని నిండు పార్లమెంట్లో అవహేళనగా మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినయి. కాబట్టే మంత్రులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేంద్రం వడ్లు కొనమని చెప్పి ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రానున్న రోజులల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
బీజేపీ నేతల్లరా తస్మాత్ జాగ్రత్త..
దేశంలో పండే ఆహార ధాన్యాలను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ, గత యాసంగి నుంచి తెలంగాణ రైతులను కేంద్రం ప్రభుత్వం మోసం చేస్తూ రాష్ట్ర మంత్రులను పట్టుకొని అవహేళనగా మాట్లాడడం వారి అహంకారానికి నిదర్శనం. నూకలు తినడం అలవాటు చేయండని మాట్లాడడం హేయమైన చర్య. ధాన్యం కొనకుండా ఇదేవిధంగా మొండిగా ప్రవర్తిస్తే తెలంగాణ రైతులందరనీ సంఘటితం చేసి కేంద్రం దిగి వచ్చేదాకా పోరాటాలు చేస్తాం. బీజేపీ నేతల్లారా తస్మాత్ జాగ్రత్త.
కేంద్రం మొండివైఖరి వీడాలి..
కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలి తండ్రి పాత్ర పోషించి తెలంగాణ రైతులను ఆదుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో పండుతున్న వివిధ రకాల పంటలకు మంచి ధర కల్పించి, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అన్యాయం చేయాలని చూస్తే తెలంగాణ రైతులు ఊరుకోరు. ఉద్యమాలు లేవదీసి కేంద్రం అంత్తుచూస్తాం.
– మారెడ్డి రామలింగారెడ్డి (తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు)
ఆగంజేస్తంటే ఊరుకోం..
నాడు తిండి లేక, పంట పండక నూకలు తిన్నం. ఎద్దు ఎవుసం తెల్వనోడు కూడా ఈరోజు తెలంగాణ వాళ్లను అవమానిస్తుర్రు. మా కేసీఆర్ సార్ పుణ్యానా నీళ్లు పుష్కలంగా ఉన్నయి కాబట్టే మంచి పంటలు పండుతున్నయి. వడ్లు కొనమంటే మమ్మల్నే నూకలు తినమంటారా. తెలంగాణ పోరాటాల గడ్డ. మిమ్మల్ని తరుముతం. మా రైతు బిడ్డల బతుకులను ఆగం చేస్తే మేము కూడా ఉద్యమంల పాల్గొంటం.
– మార్కకంటి అంజయ్య, రైతు, విఠలాపూర్