సంగారెడ్డి, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : పంట రుణమాఫీ తీరుపై రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సగం మంది రైతులకు పంటరుణం మాఫీ కాలేదు. ప్రభుత్వ గణాంకాలు సైతం దీనిని చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలో 2018లో బీఆర్ఎస్ సర్కారు లక్ష రూపాయల పంటరుణం మాఫీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 1.13 లక్షల మంది రైతులకు రూ.678 కోట్ల పంటరుణాలు మాఫీ అయ్యాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంటరుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని మూడు విడతల్లో మాఫీ అమలు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 97,710 మంది రైతులకు రూ.842 కోట్ల పంటరుణం మాఫీ చేసింది.
రూ.2 లక్షల వరకు పంటరుణం మాఫీ చేసిన నేపథ్యంలో పంటరుణం మాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 2018లో కంటే అధిక సంఖ్యలో ఉండాలి. 2018 కంటే తక్కువ సంఖ్యలో రైతులకు పంటరుణం మాఫీ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో రూ.2లక్షల వరకు పంటరుణం తీసుకున్న రైతుల సంఖ్య 3.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వం 97,710 మందికి మాత్రమే రుణమాపీ అమలు చేసింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, రేషన్‌కార్డు, పీఎం కిసాన్ సమ్మాన్ నిబంధనల అమలుతో కొద్దిపాటి రైతులకు మాత్రమే అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీకి అర్హులమైనా తమపేరు జాబితాలో లేకపోవడంపై రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. రుణమాఫీ ఎందుకు కాలేదో తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నారు.
రుణమాఫీ కాలేదంటూ సంగారెడ్డి జిల్లాలో 4348 మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయని రైతుల ఇంకా వందల్లో ఉన్నారు. మూడో విడత రుణమాఫీ సమాచారం సైతం తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మూడో విడత రుణమాఫీ జాబితాను రైతులకు అందుబాటులో ఉంచలేదు. దీనికితోడు వ్యవసాయశాఖలో బదిలీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని సుమారు 26 మంది మండల వ్యవసాయశాఖ అధికారులు బదిలీ అయ్యారు.
బదిలీల కారణంగా రుణమాఫీ సమాచారం, ఫిర్యాదుల విషయమై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంది మండలంలోని జుల్కల్ గ్రామ పంచాయతీలో 3వేల జనాభా, 2800 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. 1000 మందికిపైగా రైతులు ఉండగా, 500 మందికిపైగా రైతులు కందిలోని ఎస్బీఐ, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్నారు. గ్రామంలో మొదటి విడతగా 158 మంది, రెండో విడతలో 72 మంది రైతులకు రుణమాఫీ అయ్యింది.మూడో విడతలో ఒక్కరికీ పంటరుణం మాఫీ కాలేదని గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.