రామాయంపేట, డిసెంబర్ 1: నారు అమ్మకాలతో రైతన్నలు లాభాలు గడిస్తున్నారు. సూదూర ప్రాంతాలైన నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి రామాయంపేటలో ప్రతివారం జరిగే బుధవారం సంతకు వివిధ రకాల నారు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రామాయంపేట అంగడితోపాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించే అంగళ్లలోనూ ఇతర జిల్లాల వాసులు అంగళ్లకు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఈ నారును సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల నుంచి తరలిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఆ రైతులు తీసుకురావడానికి ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా తమ వద్ద ఉన్న ఉల్లి, పచ్చిమిర్చి, టమాట, పాలకూర తదితర నారును ఒక్కో రైతు నాలుగైదు బస్తాల పైనే ఒక్కో అంగడికి తీసుకొచ్చి విక్రయించుకుంటున్నారు. రామాయంపేటలో చుట్టూ ఉన్న మండలాలతో పాటు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండడంతో రైతులు, ప్రయాణికులకు సౌకర్యంగా ఉంది. ఈ అంగళ్లలో తాము సుమారు రూ.30వేల వరకు అమ్మకాలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉల్లినారు అమ్మకాలతో తమ ఖర్చులు పోను తమకు రూ.20వేల వరకు సంపాదిస్తామని సూర్యాపేట, నల్లగొండకు చెందిన రైతులు చెబుతున్నారు. తాము ఇతర పంటల జోలికి వెళ్లమని, కేవలం కూరగాయల పంటలు వేసుకుని విక్రయాలు జరుపుతామని వారు చెబుతున్నారు. తమకున్న వ్యవసాయంలో మొత్తం ఆరుతడి పంటలే వేస్తామన్నారు.
ఏడాదంతా కష్టపడి అమ్మకాలు చేస్తే తాము ఎకరం పొలంలో రూ.5 లక్షలకు పైగానే లాభాలు గడిస్తామన్నారు. తాము అంతర పంటలు వేసుకోవడంతో పాటు ఉల్లి, టమాటా, మిర్చి, పాలకూర, మెంతి, కొత్తిమీ ర, పుదీనా తదితర పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నామని వారు చెబుతున్నారు.
నాకున్న రెండెకరాల్లో ప్రతిసారి ఆరుతడి పంటలనే వేసుకుంటా. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉల్లి సాగునే ఎంచుకుని సాగుచేస్తున్నా. ఉల్లి సాగును అంగళ్లలో విక్రయాలు జరుపుతూ లాభాలు గడిస్తున్నా. నాకు ఈ ఉల్లి సాగే ఉపాధినిస్తున్నది. వంద కిలోమీటర్ల దూరమైనా ఉల్లినారు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నా.
నాకున్న అరెకరం భూమిలో మిర్చి నారు పెట్టాను. మిర్చి నారుతోపాటు టమాటా నారు కూడా వేస్తాం. రెండు నెలల్లో నారు చేతికొస్తుంది. నారును సంచుల్లో తీసుకుని బస్సులు లేక ఆటోల్లో అంగళ్లకు తీసుకొస్తాం. రామాయంపేట అంగడిలో గిరాకీ బాగానే ఉంటుంది. అందుకు నేను ఇక్కడికి నారు తీసుకొస్తా. లాభాలు మంచిగానే వస్తాయి.
గత ఏడాది నుంచి నా భూమిలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్న. మంచి లాభాలు వస్తున్నాయి. రామాయంపేట అంగడికి వస్తే మా నారును హైదరాబాద్, నిజామాబాద్‌కు వెళ్లే రైతులు, ప్రయాణికులు బాగా తీసుకుంటరు. ఇక్కడైనంత గిరాకీ ఎక్కడా కాదు. నాలుగు సంచుల్లో నాను తెస్తే రెండు గంటల్లోనే అమ్ముకుంటా.