కోహెడ, నవంబర్ 13: ఆస్తి రాయించుకొని వెళ్లగొట్టారని వృద్ధుడు తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కోహెడ మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు మెరుగు చంద్రయ్య పిల్లలు చూడటం లేదని, తన పేరున ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని 3 నెలలుగా పట్టించుకోవడం లేదని మంగళవారం కోహెడ నాయబ్ తహసీల్దార్ దేవేంద్రకు ఫిర్యాదు చేశారు.
తన భార్య గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడగా చేతిలో ఉన్న డబ్బులతో చికిత్స చేయించినా ఆమె బతకలేదన్నారు. నేను ఒక్కడినే ఉండడంతో తన అన్న కుమారుడు మెరుగు రాజయ్య అతడి తనయుడు సురేశ్ మాయమాటలు చెప్పి సర్వే నెంబరు 632/అ, 633/ఆ లో తనకున్న ఎకరం ఇరవై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మూడు నెలలు దాటిన తర్వాత తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాజయ్యపై చర్యలు తీసుకొని తన భూమిని తనకు ఇప్పించాలని కోరాడు.