సంగారెడ్డి, మే 21(నమస్తే తెలంగాణ): దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల తయారీకి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. బుధవారం ఐఐటీహెచ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల భారత్ విజయవంతంగా ఆపరేషన్ సిందూరు నిర్వహించిన నేపథ్యంలో ప్రతి పౌరుడిలో దేశం ముఖ్యం అన్న భావన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. త్రివిధ దళాలకు ఉపగపడేలా అధునాతన ఆయుధాలు అందించేందుకు అవసరమైన పరిశోధనలపై ఐఐటీహెచ్ దృష్టి పెట్టినట్లు చెప్పారు.
ఇదివరకే ఐఐటీహెచ్‌లో ఆర్మీకి సంబంధించిన కేంద్రం ఏర్పాటు చేశామని, త్వరలోన నేవీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత డ్రోన్ల తయారీ, ఎయిర్ అంబులెన్స్‌ల తయారీపై పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు. 200 కిలోల పేలోడ్ తీసుకెళ్లేలా డ్రోన్ తయారీకి సంబంధించిన పరిశోధనలు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు.
పరిశోధనలకు సంబంధించి ఐఐటీహెచ్ వద్ద రూ.325 కోట్ల నిధులు ఉన్నట్లు తెలిపారు. జపాన్‌తో కలిసి త్వరలోనే ఐఐటీహెచ్‌లో జాయింట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ యూనివర్సిటీలో ఐఐటీహెచ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెమి కండక్టర్ల రంగంలో అనేక కొత్త పరిశోధనలు తాము కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. తైవాన్ నేషనల్ యూనివర్సిటీతో కలిసి సెమి కండక్టర్లకు సంబంధించి సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.
సెమికండక్టర్ల రంగంలో ప్రతిష్టాత్మకమైన పలు కంపెనీలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. జపాన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలతో కలిసి స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీహెచ్‌తో దేశంలోని పలు ఐఐటీలు, ఎన్ఐటీలకు చెందిన 55 మంది పీహెచ్డీ విద్యార్థులు జపాన్‌లోని వేర్వేరు యూనివర్సిటీల్లో పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో దేశం నుంచి జపాన్‌కు వెళ్లే పీహెచ్డీ విద్యార్థుల సంఖ్య 300కు పెరగనున్నట్లు తెలిపారు.
జపాన్ వెళ్లి పరిశోధనలు చేసే పీహెచ్డీ విద్యార్థుల సంఖ్య 3వేలకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఐఐటీహెచ్ పనిచేస్తున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన సుజకితో పాటు ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు ఉండే హామమట్సు పట్టణ మేయర్ ఇటీవల ఐఐటీహెచ్‌ను సందర్శించినట్లు తెలిపారు. వచ్చే నవంబర్‌లో ఐఐటీహెచ్‌లో హామమట్సు డే నిర్వహించనున్నట్లు చెప్పారు. హామమట్స డేలో భాగంగా ఆప్రాంతంలోని పరిశ్రమలు ప్రతినిధులు ఐఐటీహెచ్‌కు రానున్నట్లు డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు.