సిద్దిపేట, ఫిబ్రవరి 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం(నేడు) పోలింగ్ జరగనున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగే పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల స్థానం నుంచి 56మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఉపాధ్యాయ స్థానం నుంచి 15 మంది పోటీపడుతున్నారు. ఇప్పటికే పోల్ చీటీల పంపిణీ పూర్తయింది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ పోల్ చీటీలో ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు మొత్తం 70,713 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 47,849, మహిళలు 22,864 ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 7,249 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 4,339, మహిళలు 2,910 మంది ఉన్నారు. పోలింగ్‌కు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వేయిలెన్స్ బృందాలు, మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సూక్ష్మ పరిశీలకులు, రూట్ అధికారులు, నోడల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
జోరుగా డబ్బుల పంపిణీ
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారింది. రెండు రోజుల నుంచి పోలింగ్ సమయం వరకు డబ్బుల పంపిణీ కొనసాగింది.ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. అయినా ఓటర్లను కలిసి డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక కీలక అభ్యర్థి ఓటుకు రూ. 5వేలు ఇవ్వగా, మరో కీలక అభ్యర్థి రూ 3వేల చొప్పున పంచారు. ఇద్దరు అభ్యర్థులవి కలిపి ఒక్క ఓటుకు రూ. 8వేల వరకు ఓటర్లకు ముట్టినట్లు తెలింది. ఇవికాకుండా ఇతర అభ్యర్థులు తృణమో ప్రణమో సమర్పించుకున్నట్లు తెలిసింది.
మండల శాఖల ద్వారా ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటే అక్కడికి పంపించారు. కొన్నిచోట్ల గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు అందించారని సమాచారం. బుధవారం మొత్తం ఓటర్లను మేనేజ్ చేసే పనిలో అభ్యర్థులు, వారి అనుచరులు నిమగ్నమైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు గెలుస్తామనుకున్న ప్రధాన అభ్యర్థులు డైలామాలో పడ్డారు. ఈ డబ్బు ఎవరి కొంప ముంచుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఉపాధ్యాయులై ఉండి అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే ఇలా డబ్బుకు తమ ఓటును అమ్ముకోవడం ఎంత వరకు కరెక్ట్..? నలుగురు కలిసిన చోట ఇదే అంశంపై ప్రధాన చర్చ జరిగింది.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 23, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 3,212 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,020 మంది, మహిళలు 1,192 ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి మొత్తం ఓటర్లు 32,589 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 21,587 మంది, మహిళలు 11,002 మంది ఓటర్లు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 28, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 2,690 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,520, మహిళలు 1,170 మంది ఉన్నారు. పట్టభద్రుల ఓటర్లు మొత్తం 25,652 మంది ఉన్నారు. వీరిలో 17,383 మంది పురుషులు, 8,269 మంది మహిళలు ఉన్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలు 22 ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 21 ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. వీరిలో పురుషులు 799 మంది, మహిళలు 548 మంది ఉన్నారు. పట్టభద్రుల ఓటర్లు మొత్తం 12,472 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 8,879 మంది, మహిళలు 3,593 మంది ఉన్నారు.