న్యాల్కల్, డిసెంబర్ 20 : సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. చిన్నతనంలో రెండు కండ్లు పోయినా.. ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఐదు పదుల వయస్సులోనూ ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. చూపులేకున్నా రెండు పీజీలు, ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. అతనితో పాటు ఆయన ముగ్గురు సంతానం సైతం సంగీత కళలో రాణిస్తున్నారు. అంధత్వాన్ని జయించి సమాజంలోని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన నర్సింహులుగౌడ్పై ‘నమస్తే తెలంగాణ ’ప్రత్యేక కథనం..
నాటు వైద్యంతో పోయిన చూపు
డప్పూర్ గ్రామానికి చెందిన నర్సింహులు గౌడ్ (52) ఐదేళ్ల వయస్సు వరకు అందరిలాగా ఆడుతూపాడుతూ గడిపేవాడు. చిన్నతనంలోనే నర్సింహులుగౌడ్ కామెర్ల వ్యాధి బారిన పడడంతో కుటుంబ సభ్యులు నాటు వైద్యం చేయించారు. అది వికటించడంతో ఆయన పూర్తిగా చూపును కోల్పోయాడు. అసలే నిరుపేద కుటుంబం కావడంతో సకాలంలో వైద్యం చేయించే పరిస్థితి లేకపోవడంతో శాశ్వతంగా చూపు కోల్పోవాల్సి వచ్చింది.
చదువు, సంగీతంలోనూ..
చిన్నతనంలోనే చూపును కోల్పోయిన నర్సింహులు గౌడ్‌ను గ్రామానికి చెందిన గుండేరావు మహరాజ్ చేరదీసి మైసూరులోని అంధుల పాఠశాలలో చేర్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. పలువురు ఆర్థిక సాయం చేయడంతో కర్ణాటక రాష్ట్రం మైసూర్లో బ్రెయిలీ లిపిలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. అనంతరం అక్కడే ఎస్సెస్సీ, పీయూసీ, బీఏ, ఎంఏతో పాటు న్యాయ విద్యలో పట్టభద్రుడయ్యాడు. కర్ణాటక సంగీతంలో మాస్టర్ డిగ్రీ, హిందూస్థానీ సంగీతంలో ప్రొఫిషియెన్సీ ఆఫ్ మ్యూజిక్ పట్టా అందుకున్నాడు. దీంతో పాటు తబలా, హార్మోనియం, అల్లికల్లో డిప్లొమా పూర్తచేసి అటు చదువు, ఇటు సంగీతంలో మంచి ప్రావీణ్యం సాధించాడు.
పలు ప్రాంతాల్లో కచేరీలు..
ఒకవైపు చిన్నారులకు సంగీత పాఠాలు బోధిస్తూనే మరో వైపు పలు ప్రాంతాల్లో కచేరీలను నిర్వహిస్తున్నారు. పట్టభద్రుడైన నర్సింహులుగౌడ్కు ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తానే సొంతంగా బీదర్ పట్టణ సమీపంలో తాద్లాపూర్లో సంగీత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 40 మందిపైగా చిన్నారులకు సంగీతంలో పాఠాలను బోధిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కర్ణాటకలోని గుల్బర్గా, హున్నాబాద్, ఉద్గిర్, తెలంగాణలో జహీరాబాద్, నారాయణఖేడ్, న్యాల్కల్, బర్దీపూర్ మండలాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కచేరీలు నిర్వహించారు. తన ప్రతిభతో అందరి మన్ననలు పొందారు. బీదర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రామ్‌చందర్ ఉత్తమ కళాకారుడిగా సత్కరించారు. సురబీ టెలివిజన్, అఖిల భారతీయ హిందుస్తాన్ కచేరీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నర్సింహులు గౌడ్ తన పిల్లలతో కలిసి పాల్గొని ప్రతిభ కనబర్చారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే సంగీత కళాశాల ఏర్పాటు చేస్తా..
ఖర్చుతో కూడుకున్న పని కావడంతో సొంతంగా సంగీత పాఠశాల ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తే సొంత గ్రామమైన డప్పూర్‌లో లేదంటే మండల కేంద్రమైన న్యాల్కల్లో సంగీత పాఠశాలను ఏర్పాటు చేస్తా. డప్పూర్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సంగీతం నేర్చుకునేందుకు పిల్లలు ఎవ్వరూ రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో, సంగీత పాఠశాలను బీదర్ పట్టణ సమీపంలోని తాద్లాపూర్లో ఏర్పాటు చేశా. పిల్లలకు సంగీతం పాఠాలు నేర్పిస్తూ, పలు ప్రాంతాల్లో నిర్వహించే కచేరీల్లో పాల్గొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
నర్సింహులుగౌడ్ బాటలోనే పిల్లలు..
నర్సింహులు గౌడ్‌కు భార్య, ముగ్గురు సంతానం. పిల్లలు అంబరీష్, ఉమారాణి, పవన్‌ను సైతం సంగీత పాఠశాలలో చేర్పించారు. జూనియర్, సీనియర్ సంగీత విభాగాల్లో వారు విద్యనభ్యసిస్తున్నారు. తండ్రితో కలిసి పిల్లలు పలు ప్రాంతాల్లో కచేరీల్లో పాల్గొంటున్నారు.