రూ.1.50 కోట్లతో వైకుంఠధామం..
రూ.10 కోట్లతో జాతీయ రహదారిపై డివైడర్ ఏర్పాటు
రూ.5.50 కోట్లతో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో రూ. 2.38 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు
బల్దియా అభివృద్ధికి తాజాగా రూ.50 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
జహీరాబాద్, ఫిబ్రవరి 26: మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు పట్టణం జహీరాబాద్ సమైక్య రాష్ట్రంలో సమస్యలతో కొట్టుమిట్టాడగా, స్వరాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నది. కోట్లాది రూపాయలు కేటాయించి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది, ప్రభుత్వం రూ.10 కోట్లతో పట్టణంలో జాతీయ రహదారిని విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. అలాగే రూ. 1.50 కోట్లతో హిందూ వైకుంఠధామం, ఆర్యనగర్‌లో రూ.3 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టింది. కోట్లాది రూపాయలతో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నది. ఇంటింటికీ శుద్ధినీరు ఇవ్వడానికి రూ. 24 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. హైమాస్ట్ దీపాల ఏర్పాటుతో రాత్రిళ్లు పట్టణం జిగేల్ మంటున్నది. రూ. 100 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు వేగంగా పూర్తిచేయడానికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకృ దృష్టిసారించారు.కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ మరో రూ.50 కోట్లు మంజూరు చేయడంతో పట్టణం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణం తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నది. జహీరాబాద్‌కు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రకు సమీపంలో ఉండడంతో అక్కడి ప్రజలు సైతం రాకపోకలు సాగిస్తుంటారు. జహీరాబాద్ మున్సిపల్‌కు సమీపంలో ఉన్న అల్లీపూర్, పస్తాపూర్, రంజోల్, చిన్న హైదరాబాద్, హోతి(కే) గ్రామ పంచాయతీలను మున్సిపల్లో విలీనం చేశారు. మున్సిపల్ విలీన గ్రామాలతో పాటు జహీరాబాద్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, కలెక్టర్ హనుమంతరావు మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడుపడుతున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో పట్టణం మరింతగా అభివృద్ధి చెందనున్నది.
టీఆర్ఎస్ పాలనలో జోరుగా అభివృద్ధి …
ప్రభుత్వం రూ.10 కోట్లతో జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిని విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేసింది. రంజోల్ నుంచి జహీరాబాద్ వరకు డివైడర్లు, రోడ్డు విస్తరణ పూర్తికావడంతో ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. పట్టణంలో రూ. 1.50 కోట్లతో హిందూ వైకుంఠధామం ఏర్పాటు చేశారు. ఆర్యనగర్‌లో రూ.3 కోట్లతో మురుగుకాల్వ పనులు చేశారు. మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్, ఎన్జీవో కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లోని పార్కుల్లో రూ. 40 లక్షలతో సౌకర్యాలు కల్పించారు. పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.5.50 కోట్లు మంజూరు చేసింది. నిధులు సరిపోక పోవడంతో భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఇటీవల మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్‌లో మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షచేసి భవన పనులు పూర్తి చేసేందుకు అదనంగా రూ.4.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు లింగాయత్, యాదవ్ సంఘం, బాబూ జగ్జీవన్ రావు భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
రూ.24కోట్లతో మిషన్ భగీరథ పనులు…
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికీ నాణ్యమైన ఫిల్టర్ తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి రూ.24కోట్లు మంజూరు చేసింది. తాగునీటిని సరఫరా చేసేందుకు ట్యాంకులు, పైపులైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. అధికారులు పనులు వేగవంతం చేశారు. దీంతో పట్టణంలో తాగునీటి సమస్యకు విముక్తి లభించనున్నది.
జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు..
జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారి మధ్యలో హైమాస్ట్ దీపాలు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. రైల్వేగేట్ నుంచి రంజోల్ వరకు బటర్ ఫ్లై దీపాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారితో పాటు పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో విద్యుతు దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.
రూ.100 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం
జాతీయ రహదారిపై రైల్వేగేటు ఉండడంతో రైలు వచ్చే సమయంలో గేటు వేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం సర్వేచేసి నాలుగు లైన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్ నిర్మాణ బాధ్యతలు ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. ఇంజినీరింగ్ అధికారులు సర్వేచేసి, టెండరు పూర్తివేసి కాంట్రాక్టరుకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సీసీ రోడ్లు, మురుగుల కాల్వల నిర్మాణం…
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణం చేస్తున్నారు. పట్టణాన్ని ఆదర్శంగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మున్సిపల్లో చెత్త సేకరించేందుకు కొత్తగా వాహనాలు కొనుగోలు చేశారు. ప్రతిరోజు వార్డుల్లో తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. జహీరాబాద్‌ను చెత్త రహిత పట్టణంగా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుండడంతో మార్పు కనిపిస్తున్నది. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ మౌలిక వసతులు మెరుగుపడుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం
జహీరాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ప్రణాళికా బద్ధంగా పనులు కొనసాగిస్తున్నాం. సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతీ ఇంటికీ మిషన్ భగీరథ నీరు, ప్రతి వార్డులో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
మున్సిపల్లో వేగవంతగా అభివృద్ధి పనులు
జహీరాబాద్ మున్సిపల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కలిపించేందుకు పనులు చేస్తున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథలో పనులు సాగుతున్నాయి. సీసీ రోడ్లు , మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపడుతున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు రోడ్లు విస్తరణ చేసి డివైడర్లు ఏర్పాటు చేశాం. ఆదర్శ మున్సిపల్‌గా జహీరాబాద్‌ను మారుస్తాం.
– సుభాశ్‌రావు , మున్సిపల్ కమిషనర్ జహీరాబాద్