గజ్వేల్, ఫిబ్రవరి 28: దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటిక (కబ్రస్థాన్) లేకపోవడంతో ఆగ్రహించిన ఎర్రవల్లి గ్రామస్తులు శుక్రవారం మృతదేహంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లి గ్రామస్తులు గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో వారికి శ్మశాన వాటిక స్థలాన్ని అధికారులు నేటికీ కేటాయించలేదు.
హిందువులు కాలనీ సమీపంలో దహనసంస్కారాలు నిర్వహిస్తుండగా, ముస్లింలు మాత్రం అలా చేయలేకపోతున్నారు. తప్పనిసరిగా ముస్లింలు మసీద్ సమీపంలోని కబ్రస్థాన్లోనే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. దహన సంస్కారాలు చేపట్టేందుకు కబ్రస్థాన్ లేకపోవడంతో మహిళా మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. చివరకు గజ్వేల్ మసీద్ కమిటీ అధ్యక్షుడు మతిన్ తాత్కాలిక పరిష్కారం చూపడంతో దహన సంస్కారాలను గజ్వేల్ కబ్రస్థాన్లో నిర్వహించారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు చెందిన ముస్లింలకు కబ్రస్థాన్ కోసం రెవెన్యూ అధికారులు తక్షణమే స్థలాన్ని కేటాయించాలని ఎర్రవల్లి గ్రామ ముస్లిం హైదర్పటేల్, అంజద్, ఉస్మాన్, షాదుల్లా కోరారు. గతంలో కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా నేటికీ పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగానే తప్పనిసరి పరిస్థితుల్లో మృతదేహంలో ఆర్డీవో కార్యాలయానికి వచ్చామన్నారు. అయినా శాశ్వత పరిష్కారాన్ని అధికారులు చూపించలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్థలాన్ని కేటాయించాలని కోరారు.