సిద్దిపేట అర్బన్, మే 12 : జిల్లాలో లోక్ సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాకల పరిధిలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రిని భారీ భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గజ్వేల్‌లో 322, హుస్నాబాద్‌లో 304, సిద్దిపేటలో 273, దుబ్బాకలో 253 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
అదే విధంగా జిల్లాలో 9,66, 330 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం 1,382 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,382 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,765 మంది అదర్ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించడంతో పాటు, 106 మంది మైక్రో అబ్జర్వర్లు 131 మంది రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. నేడు ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అన్నింటికీ వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు.
జిల్లాలో మొత్తం 9,66,330 మంది ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు 4,92,714 మంది.. పురుష ఓటర్లు 4,75,535 మంది ఉన్నారు. ఇందులో జిల్లాలోని హుస్నాబాద్(32) నియోజకవర్గంలో 2,37,591 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 1,25,981 మంది ఉండగా.. పురుషులు 1,21,715 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. సిద్దిపేట(33) నియోజకవర్గంలో మొత్తం 2,37,591 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 1,21,084 మంది ఉండగా.. పురుషులు 1,16,436 మంది, ఇతరులు 71 మంది ఉన్నారు. దుబ్బాక(41) నియోజకవర్గంలో మొత్తం 2,00,125 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 1,02.927 మంది ఉండగా.. పురుషులు 97,198 మంది ఉన్నారు. గజ్వేల్(42) నియోజకవర్గంలో మొత్తం 2,80, 913 మంది ఉండగా.. ఇందులో మహిళలు 1,42,722 మంది ఉండగా.. పురుషులు 1,38,186 మంది ఉండగా.. ఇతరులు ఐదుగురు ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 2,482 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 1,054 మంది కమిషనరేట్‌లో ఉన్న అధికారులు, సిబ్బంది, సాయుధ బలగాలు, హోంగార్డులు ఉండగా.. 450 మంది కేంద్ర బలగాలైన ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది, 978 మంది ట్రైనీ ఎస్సైలు, ట్రైనీ కానిస్టేబుళ్లు, ట్రైనీ ఎస్పీఎఫ్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.