చౌటకూర్, జనవరి 22: తమకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూర్ మండలం బద్రిగూడెంలో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. వివరాలు.. బుధవారం బద్రిగూడెంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ను ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన చిలిపిచెట్టి అలివేలమ్మ, రాములు దంపతులు కలిశారు.
తమ ఒక్కగానొక్క కుమారుడు ఇరవై ఏండ్ల క్రితం చనిపోయాడని, తమకు ఎలాంటి ఆధారం లేదని, భిక్షంతో జీవిస్తున్నామని , పింఛన్ మంజూరు చేయలని వేడుకున్నారు. బద్రిగూడెం గ్రామానికి కలెక్టర్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు, గ్రామస్తుల సహాయంతో ఉప్పరిగూడెం నుంచి బద్రిగూడెం చేరుకున్నారు.
అప్పటికే గ్రామసభ ముగియడంతో కలెక్టర్ తన వాహనంలో ఎక్కారు. దీంతో వృద్ధ దంపతులు చిలిపిచెట్టి అలివేలమ్మ, రాములు వాహనానికి ఎదురుగా వెళ్లి మొరపెట్టుకున్నారు. తాము దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, పింఛన్ రావడం లేదంటూ వేడుకోగా, వాహనంలోంచి కిందకు దిగిన కలెక్టర్ అక్కడే ఉన్న ఆర్డీవో పాండుతో మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే వృద్ధ దంపతుల్లో ఒకరికి పింఛన్ మంజూరు చేసేందుకు ఫైల్ పెట్టాలని ఆదేశించారు.