Edupayala | పాపన్నపేట, జూన్ 28 : ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకోని ఏడుపాయల వనదుర్గ భవాని మాతను శాకాంబరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా రకరకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి మాతగా ప్రత్యేక తరహాలో చూపర్లను ఆకర్షించే విధంగా అలంకరించారు. ఆషాడ మాసం పుస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవాని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సుధీర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మాంజీరా నదిలో వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్యాం, బ్రహ్మాచారి, బత్తిని రాజు, నర్సింహులు, వరుణాచారి, నరేష్, దీపక్, తదితరులు ఏర్పాట్లు చేయగా వేదపండితులు శంకరశర్మ, పార్థీవ శర్మ, రాము శర్మ, నాగరాజు శర్మ, తదితరులు పూజలు నిర్వహించారు. ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.