మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను సమర్థవంతగా నిర్వహించాలని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీల ప్రత్యేకాధికారుల, వసతి గృహాల వార్డెన్లతో 2025-26 విద్యాసంవత్సరం నిర్వహణపై సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారం అందించాలన్నారు. వంట గదుల్లో శుభ్రత, వంటల సామగ్రి, సరుకులు, నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి కఠినమైన నిబంధనలు పాటించాలన్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కాగా మెనూ అమలు చేయాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు, కుక్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అమలును పర్యవేక్షించాలన్నారు.
మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్ల శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుణాత్మకమైన విద్య అందించంతో పాటు మానసిక శారీరక, ధృడత్వానికి క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి కల్పించాలన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఈవో రాధాకిషన్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, మైనారిటీ సంక్షేమ అధికారి జెమ్లానాయక్, అకడమిక్ అధికారి సుదర్శన్మూర్తి, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు.
ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ
2025-26 విద్యా సంవత్సరానికి రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా కోఆర్డినేటర్ శిరీష తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కళాశాలల్లో 60 శాతం సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులకు, 40 శాతం బయట విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. మిగతా వివరాలకు సెల్: 80966 91184, 96425 79305 నంబర్లను సంప్రదించాలని సూచించారు.