సమాధానం ఇవ్వకుండా విసుక్కుంటే అసలుకే ఎసరు
పిల్లల సందేహాలు తీర్చితే వారి దృష్టిలో మీరే గురువు
వాటిని నివృత్తి చేయడం పెద్దల బాధ్యత
బయటకు తీసుకెళ్లి అన్నీ నేర్పించండి
వాటితోనే అనుబంధాలు పెరుగుతాయి..
మెదక్డెస్క్, ఫిబ్రవరి 26: పిల్లలను దేవుడు తీసుకొచ్చి ఇస్తాడా? నన్ను ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? ఓ తల్లికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవి.. గడియారం ముల్లు అలాగే ఎందుకు తిరుగుతుంది? భూమిపై ఉన్న అందరం ఒకే భాష ఎందుకు మాట్లాడం? జంతువులు, పక్షులు మాట్లాడుతాయా? టైం అంటే ఏమిటి? ఓ టీచర్‌కు చిన్నారి అడిగిన ప్రశ్నలివి.. పగటిపూట మనకు చంద్రుడు ఎందుకు కనిపించడు.?.. ఇలా చిన్నారులకు ఎన్నో డౌట్లు వస్తుంటాయి. చిన్న పిల్లలు అంటే అంతే. వారిది తెలిసీ తెలియని వయస్సు కదా! అందుకే ప్రశ్నలు ఏం అడగాలో, ఏం అడగకూడదో తెలియదు. కొన్నిసార్లు వారు అడిగే చిత్రాతి చిత్రమైన ప్రశ్నలు మనకు నవ్వును తెప్పిస్తాయి.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి.. కొన్నింటికి మనం సమాధానాలు చెబుతాం.. కొన్నింటికి ఏం చెప్పాలో అర్థం కాదు. అయితే, చిన్నారుల సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలని, అలా సందేహాలు తీర్చడం ద్వారా వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుందని, దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. పిల్లల సందేహాలను ఎలా తీర్చాలో ఈ వారం ‘సండే స్పెషల్’లో తెలుసుకుందాం..
నాన్న.. మనం అంతా నిద్రపోతున్నాం కదా.. మరి మన బస్సు డ్రైవర్ కూడా నిద్ర పోతాడా..? రాత్రి సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి అడిగిన ప్రశ్న ఇది..! అమ్మా రాత్రి ఎందుకు అవుతుంది? పగలే ఉండొచ్చు కదా? ఓ తల్లికి ఎదురైన సందర్భమిది.. చిన్నారులకు ఇలా ఎన్నో డౌట్లు వస్తుంటాయి. బియ్యం ఎక్కడ పండుతాయి.. ఆ విమానం అలా ఎలా ఎగురుతుంది..? ఇలా అడుగుతుంటే వీడు ప్రశ్నలతోనే పుట్టాడురా బాబూ! అనిపిస్తుంది. ఇలాంటి డౌట్లు అడిగినప్పుడు వారి సందేహాలను తల్లిదండ్రులు తీర్చేయాలి. అలా సందేహాలను తీర్చడం ద్వారా వారికి మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు మీతో ప్రత్యేక అనుబంధం కూడా పెరుగుతుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
చిన్నారులకు ప్రతీది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కొంతమంది పిల్లల్ని చూస్తే కొశ్చన్లు ముందు పుట్టి, తర్వాత వీడు పుట్టాడు అని అంటారు. ఒక్కోసారి చిన్నారి వ్యక్తపరుస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్నిసార్లు అది నీ వయసు కాదని, నీకంత
అవసరమా? అని, మరికొన్ని సార్లు మనకు తెలియక ఎలా చెప్పాలో అర్థం కాక చిన్నారులను విసుక్కుంటూ ఉంటాం. కానీ, అది మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల ప్రశ్నలకు వందశాతం సమాధానాలు చె ప్పడం ద్వారానే ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. చిన్నారుల సందేహం తీర్చడంతో అతడికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో కూడా రుజువైందని ఆధారాలు చూపుతున్నారు.
అతి క్రమశిక్షణ వద్దు
కొంత మంది తల్లిదండ్రులు చిన్నారిని ఇంటికి రాగానే ‘షూ విప్పూ.. టై తీసేయి.. ఫలానా చోట పెట్టు.. ఆ తర్వాతే మాట్లాడు’.. అనే కండీషన్లు పెడుతున్నారు. క్రమశిక్షణ మంచిదే.. కానీ, అతి ప్రమాదకరం. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి స్కూల్లో జరిగిన సంఘటన ఏదో మీకు చెప్పాలన్న ఆతృతలో ఉంటారు. వాటిని వినండి. అప్పుడు ఆ చిన్నారి మనసు కుదుట పడుతుంది. అలా కాకుండా క్రమశిక్షణ పేరుతో వేరే అంశాలు చెబితే, వాళ్లు మానసికంగా మీకు దగ్గర కారు. చిన్నారులు గానీ, యుక్త వయసు పిల్లలు గానీ సందేహాలడిగితే ఎటువంటివి అయినా వివరించి చెప్పండి. రాజకీయాలు, యుక్త వయసులో వచ్చే మార్పులపై గానీ అడిగితే సందేహాలను నివృత్తి చేయండి. అలా చెబితే వారికి మీరే గురువు అవుతారు. బయటకు తీసుకెళ్లి అన్నీ నేర్పించడంతో మీతో మీ చిన్నారికి విడదీయరాని బంధం ఏర్పడుతుంది. అది వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుంది.
ఇలా చేయండి..
పిల్లలకు దగ్గరిలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లండి. మొక్కలు ఎలా పెరుగుతాయి.. మన ఇంట్లో ఉపయోగించే ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పాలు వంటివి ఎలా వస్తాయి. వేటి నుంచి వీటిని సేకరిస్తారు, అవి పండే విధానం వివరంగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పదో తరగతి చదువుతున్న సగం మంది అర్బన్ ప్రాంత విద్యార్థులు బియ్యం నేరుగా పండుతాయి అనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు.
మానసిక అనుబంధం..
చిన్న వయసులో వారికి వచ్చే సందేహాలను విడమర్చి చెప్పడంతో వారికి మీతో మానసిక అనుబంధం పెరుగుతుంది. ఇది వారు పెద్ద అయిన కొద్దీ మీపై నమ్మకాన్ని పెంచుతుంది. అది మీరు మంచిసలహా ఇస్తారన్న అభిప్రాయం కలిగింపజేసి, యుక్త వయసు వచ్చిన తర్వాత కలిగే మానసిక సంఘర్షణను మీతోనే పంచుకుంటారు. అది మీ ఇద్దరికీ శ్రేయస్కరం. ఆ వయసులో కలిగే సందేహాలు చెప్పుకోలేని విధంగా ఉంటాయి. కానీ, తండ్రి లేదా తల్లికి చెబితే అపార్థం చేసుకోరు అనే నమ్మకం కలిగిస్తే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కూడా తల్లిదండ్రులతో పూర్తిగా చర్చించే పరిస్థితి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రేమలో పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని కౌన్సెలింగ్ చేస్తున్న సమయంలో 90శాతం యువతీ యువకులు ఇస్తున్న సమాధానం ‘మా మాట పట్టించుకోరు.. నీకేం తెలుసులే అంటారు.. నీకు అవసరమా? అనే సమాధానాలతో విసిగిపోయాం’.. అని. వివరంగా చెబితేనే మేలు..ఎదిగే కొద్దీ పిల్లల్లో అసహజమైన ప్రశ్నలు ఏమీ రావని, వారి వయసుకు తగ్గ సందేహాలే వస్తాయని మానసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యుక్త వయసులో బాలబాలికల్లో వచ్చే మానసిక, శారీరక మార్పులపై కూడా విడమర్చి చెప్పడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. వారి సందేహాలు నివృత్తి కాకపోతే వారు ఇదే విషయాన్ని వేరే వారి వద్ద ప్రస్తావిస్తారు. వేరే వాళ్లు తెలియక ఇచ్చే తప్పుడు సలహాలతో పిల్లలు తప్పుదోవ పట్టే ప్రమాదమున్నది. ప్రతి చిన్నారి అడిగే ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పండి.
ఏటీఎంలో డబ్బులు ఎలా తీయాలి, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలి అనేది దగ్గరుండి చూపించండి. షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లి మంచి, చెడు వస్తువులను ఎలా గుర్తించాలో కూడా చెప్పండి. ఇది ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏండ్లలోపు పిల్లలందరికీ చెప్పడంతో వారి మానసిక ఎదుగుదల పెరగడంతోపాటు చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన పెరుగుతుంది.
విహార, విజ్ఞాన యాత్రలుగా మరల్చడంతో వారి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి మీరు వేరే రాష్ర్టాలు, దేశాలు వెళ్లాల్సిన పనిలేదు. అవకాశం ఉంటే మీ పరిసర ప్రాంతాల పల్లెటూర్లు, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లండి చాలు.
తాటి ముంజలు అంటే ఎంత మందికి తెలుసో మన అందరికీ తెలుసు. ఆ పరిస్థితి ప్రస్తుతం ఉన్న చిన్నారులకు రాకుండా వాటిని వివరిస్తే కనీసం వారి తర్వాత తరాలకు చెప్పడానికైనా వారికి పనికి వస్తుంది.