బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ర్టాలలో తరుచుగా గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం అవుతున్నది. తమకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకొని ప్రజాసేవ చేస్తామని, ఆ కార్యక్రమాలను ఎవరూ ఆపలేరంటూ గవర్నర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఈ వైఖరి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది.
గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగ సభ సవివరంగా చర్చించింది. రాజ్యాంగ సభ సలహాదారు సర్ బెనెగల్ నర్సింగరావు 1947 మే 30న ‘మెమొరాండం ఆఫ్ ప్రిన్సిపిల్స్ ఆఫ్ ఎ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్’ను రాజ్యాంగ సభ సభ్యులకు అందచేశారు. ఈ పత్రాన్ని 1946 మే 16న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను అనుసరించి రాష్ర్టాలకు అత్యధిక స్వయంప్రతిపత్తి ఉండే విధంగా రూపొందించారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచించినట్టుగా- విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వంటి అత్యంత ముఖ్యమైనవి తప్పించి మిగతావాటిని రాష్ర్టాలకే ఇవ్వాలని రాజ్యాంగ సభ భావించింది.
1947 జూన్ 3నభారతదేశ విభజన ప్రస్తావనను బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. విభజన, రాష్ర్టాలు, సంస్థానాల విలీన అంశాలు తెరపైకి వచ్చాయి. దీంతో అప్పటి పరిస్థితులను అనుసరించి రాజ్యాంగ సభలోని ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ ఉమ్మడి సమావేశం 1947 జూన్ 7న జరిగింది. భారత రాజ్యాంగం సమాఖ్య స్వరూపంతో బలమైన కేంద్రాన్ని కలిగి ఉండాలని ఈ సమావేశం తీర్మానించింది. తదనుగుణంగా 1935 భారత రాజ్యాంగ చట్టంలోని అత్యధిక అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు.
అయితే సదరు చట్టంలో బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్‌కు అత్యధికంగా అధికారాలు ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన ప్రాధాన్యత స్వతంత్ర భారతావనిలో అవసరం లేదని, దీనివల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని నర్సింగరావు అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఏర్పడితే, మంత్రిమండలి రాజీనామా చేస్తే, గవర్నర్ మరో మంత్రిమండలిని నియమించుకోవటానికి వీలు లేదు అని స్పష్టం చేశారు. గవర్నర్, మంత్రిమండలి మధ్య సంబంధం బ్రిటిష్ రాజు-అక్కడి మంత్రిమండలి సంబంధం లాగానే ఉండాలని, గవర్నర్‌కు ఎలాంటి విశేష అధికారాలు ఉండకూడదని రాజ్యాంగ సభకు నివేదించారు.
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం, శాంతిభద్రతలకు, ప్రశాంతతకు ముప్పు వాటిల్లి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సమావేశపరచడమో లేక రద్దు చేయడమో తప్ప ఎలాంటి అధికారం గవర్నర్‌కు ఉండదని రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టం చేశారు. గవర్నర్ అనేది నామినేటెడ్ పదవి అనీ, రాష్ట్రపతిలాగా ఎన్నుకోబడినది కాదు కనుక, ఎటువంటి విచక్షణ అధికారాలనైనా కలిగి ఉండటం ‘సూత్రప్రాయంగా తప్పు అనీ, రాజ్యాంగ, ప్రభుత్వ సిద్ధాంతాలకూ, సూత్రాలకు విరుద్ధమనీ హెచ్.వి కామత్ రాజ్యాంగ సభ లో తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకు న్న (బ్రిటీష్ ప్రభుత్వంలో జరిగిన) సంఘటనల గురించి కామత్, రోహిణి కుమార్ చౌదరి తదితర సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ అధికారాల చర్చలో చివరిగా- రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం… గవర్నర్‌కు స్వయంగా నిర్వర్తించే విధులు లేవని, ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం- మంత్రివర్గం సలహాను తప్పక అంగీకరించాలని అంబేద్కర్ చెప్పారు. ఏదో విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి లేదా క్యాబినెట్ నిర్ణయాన్ని భంగపరచడానికి ఆర్టికల్-163 వీలు కల్పిస్తుందనే విమర్శ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అంబేద్కర్ చెప్పారు.
గవర్నర్లకు ఏ పనులు ఉండనప్పటికీ, కచ్చితంగా చేయవలసిన విధులు ఉంటాయని వివరించారు. 1). మంత్రిమండలిని ఏర్పాటు చేయడం, మంత్రిమండలి సిఫారసు చేసిన రాజ్యాంగబద్ధ సూచనలు అమలు చేయడం. 2). మంత్రిత్వశాఖకు సలహా ఇవ్వడం, మంత్రిత్వశాఖను హెచ్చరించడం, మంత్రిత్వశాఖకు ప్రత్యామ్నాయాన్ని సూచించడం, పునఃపరిశీలించమని కోరడం వంటివి గవర్నర్ విధులని వివరించారు.
ఆర్టికల్-163లోని ‘విచక్షణ అధికారం’ అనే నిబంధన చాలా పరిమితమైనదనీ, అది రాజ్యాంగం ప్రకారం లేదా రాజ్యాంగపరిధిలో అని స్పష్టం చేస్తున్నది కాబట్టి, గవర్నర్‌కు మంత్రుల సలహాలను విస్మరించే అధికారం ఎంతమాత్రం లేదు అని అంబేద్కర్ స్పష్టం చేశారు. పైన పేర్కొన్న వాటికి మించి గవర్నర్‌కు ఎలాంటి విధులు లేవని, గవర్నర్ పదవి పూర్తిగా అలంకారప్రాయమైనదని బాబాసాహెబ్ తెలియజేశారు.
ఆర్టికల్-167లో ఉన్న ఏకైక నిబంధన.. మంత్రిమండలి, ముఖ్యమంత్రి నుంచి ఏదైనా సమాచారాన్ని గవర్నర్ కోరవచ్చు. అయితే ఈ ఆర్టికల్‌కు కూడా రాజ్యాంగసభలో చాలా వ్యతిరేకత వచ్చింది. గవర్నర్ కోరిన మొత్తం సమాచారాన్ని సమర్పించడం ముఖ్యమంత్రి బాధ్యతగా మార్చడానికి వ్యతిరేకంగా బలమైన వాదనలను హెచ్.వి. కామత్ వినిపించారు. ఇది గుర్రం ముందు బండిని పెట్టడం లాంటిదన్నారు. ఏ సమాచారం సమర్పించాలి, ఏది చేయకూడదనేది ముఖ్యమంత్రికి వదిలివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ముఖ్యమంత్రిని ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నించడానికి సాధారణ తెలివితేటలు ఉన్న ఏ గవర్నర్ అయినా ఇష్టపడరని నేను కచ్చితంగా అనుకుంటున్న’ అని పీఎస్ దేశ్‌ముఖ్ అన్నారు. అయితే అందుకు గ్యారంటీ ఏమిటి అని కామత్ అడిగారు. గవర్నర్ తెలివితేటలు, గవర్నర్‌ను నియమించే ప్రధాని విజ్ఞత మీద ఆధారపడి వుంటాయి అని దేశ్‌ముఖ్ బదులిచ్చారు. ఈ చర్చల ఆధారంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163లో (రాజ్యాంగ సభలో చర్చ జరిగేటప్పుడు ఆర్టికల్ 143గా ఉన్నది) గవర్నర్-మంత్రిమండలి మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్న దానిని నిర్వచించారు.
సుప్రీంకోర్టు తీర్పులు
సమాఖ్యవాదానికి అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాపాడేలా, కేంద్రం, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు అనేకం ఉన్నాయి. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలను నిర్వచించే క్రమంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను ప్రస్తావించి రాష్ర్టాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యతను తెలియచేసింది. రాజ్యాం గ ప్రాథమిక నిర్మాణంలో సమాఖ్యవాదం, లౌకికవాదం భాగమని ఎస్ఆర్ బొమ్మై-యూనియన్ ఆఫ్ ఇండియా (గవర్నర్ చర్యల మీద) కేసులో సుప్రీంకోర్టు అభివర్ణించింది. గవర్నర్ విచక్షణాధికారం, ఆర్టికల్-163 వినియోగం పరిమితం అని నబమ్ రెబియా-డిప్యూటీ స్పీకర్ (2016) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. గవర్నర్ విచక్షణాధికారాలు చాలా పరిమితమైనవని సుప్రీంకోర్టు తీర్పులను విశ్లేషించిన రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేశారు.
కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ప్రభుత్వంలో భాగం గవర్నర్. ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నిందించలేదు. ప్రభుత్వ ప్రతిస్పందనను గవర్నర్ బహిరంగంగా అడగలేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ నిందిస్తూ, తనకు తాను కార్యనిర్వాహకవర్గానికి దూరమై, ప్రతిస్పందనను కోరుతున్నట్లయితే, దానిని రాజకీయ ఉద్దేశంతో చేసిన చర్యగా భావించాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటామని, సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజాదర్బార్లను నిర్వహిస్తామని గవర్నర్లు అనడం రాజ్యాంగ వ్యతిరేకమనీ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమనీ రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు లేవు. భారత రాజ్యాంగ సభ తొలుత అనుకున్నట్టుగా రాష్ర్టాలకు అత్యధికంగా స్వయంప్రతిపత్తి ఇవ్వవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నట్టు పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో, ప్రజల అవసరాల దృష్ట్యా, అధికార వికేంద్రీకరణ పూర్తిస్థాయిలో జరుగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
గవర్నర్‌కు రెండు రకాల అధికారాలుంటాయి.
ఒకటి.. రాజ్యాంగబద్ధమైనవి.
రెండు.. సందర్భాన్ని అనుసరించి.
రాజ్యాంగబద్ధమైనవి
సందర్భానుసారం..
ఇలాంటి సందర్భాలు కాకుండా.. ఇతర సందర్భాలలో రాజ్యాంగపరమైన అనుమతిని దాటి తన అభీష్టం ప్రకారం వ్యవహరించటం రాజ్యాంగ వ్యతిరేకం. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రజల తీర్పు పైన దాడిగా అది పరిగణించబడుతుంది.
-పెండ్యాల మంగళా దేవి