మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 30: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ శివారుపల్లె పిట్టలగూడెంలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీరు లేక గూడెం వాసులు అల్లాడిపోతున్నారు. పిట్టలగూడెంలో సుమారు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో 250 నుంచి 300 జానాభా ఉంది. పిట్టలగూడెంకు తాగునీరు అందించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రెండు బోరుబావులు ఉన్నాయి. రెండు నెలల క్రితమే రెండు బోరుబావులు ఎండిపోయాయి.
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గూడెం ప్రజలు తాగునీటికి పడుతున్న ఇబ్బందులను చూసి తండాకు చెందిన తుమ్మల అశోక్ తన బోరుబావి నుంచి గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని ఎక్కిస్తే పైపులైన్ దెబ్బతినడంతో ఇండ్లలోకి నీటి సరఫరా కావడం లేదు. మంచి నీళ్లు అందించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదనిగూడెం వాసులు మండిపడుతున్నారు.
మా పిట్టలగూడెంలో నెల రోజుల నుంచి నీళ్లు లేక మస్తు ఇబ్బంది పడుతున్నం. కనీసం తాగడానికి కూడా ఊళ్లే నీళ్లు దొరుకతలేదు. మొన్న ట్యాంకర్తోటి నీళ్లు తెప్పించుకున్నం. నీళ్లు వస్తలేవని ఆఫీసర్లకు చెప్పిన పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు వచ్చి మాకు నీళ్లు వచ్చేటట్లు చూడాలే. లేకపోతే ఖాళీ బిందెలను తీసుకొని ఆఫీసుల దగ్గరికే వస్తాం.
– శాంతమ్మ, పిట్టలగూడెం
నడి ఎండ కాలంలో తాగునీళ్లు లేక గూడమం తా ఇబ్బందిపడుతున్నది. రెండు బోర్లు ఉంటే అవి మొత్తం ఎండిపోయినయి. నెలరోజుల నుం చి మిషన్ భగీరథ నీళ్లు అస్తలేవు. పైపులైన్ పగిలిపోయిన రిపేరు చేసేటోళ్లు లేరు. మా బోరు నుంచైనా నీళ్లు పెడతామని ట్యాంక్‌కు నీళ్లేక్కిస్తే పైపులైన్ సరిగా లేక నీళ్లు ఇండ్లల్లకు పోతలేవు. నీళ్లకోసం మేము ఇంత ఇబ్బంది పడుతున్న ఏ ఒక్కలు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవడం లేదు.
-తుమ్మల అశోక్, పిట్టలగూడెం