చిన్నకోడూరు, ఏప్రిల్ 16: చేతివృత్తుల వారిని ప్రోత్సహించడంతోపాటు పేదలకు జీవనోపాధి కల్పించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే వాటర్ షెడ్ పథకం లక్ష్యమని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా అన్నారు. బుధవారం మండల పరిధిలోని చౌడారంలో వాటర్ షెడ్ యాత్ర నిర్వహించారు. జీవనోపాధుల కింద నెలకొల్పిన పలు యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పండ్ల తోటల పెంపకానికి సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
నేల, నీరు, వృక్ష సంపదను వినియోగించుకోవాలన్నారు. వర్షపు నీరు వృథా కాకుండా కందకాలు, రాతికట్టడాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవచ్చన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 311 మందికి రూ.1.54 కోట్ల రుణాలు వీవోల ద్వారా మహిళా జీవనోపాధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, అడిషనల్ పీడీ బాలకిషన్, డీపీఎం కరుణాకర్, ఏడీవీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో జనార్దన్, వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ నూరోద్దీన్, ఎంపీవో సోమిరెడ్డి, ఏపీవో స్రవంతి, ఏపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.