సిద్దిపేట, జూన్ 4: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందొద్దని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, 24 ఏండ్ల చరిత్రలో బీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు చూసిందన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదురొని నిలబడిందని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ, తమని తాము సంసరించుకుంటూ, భవిష్యత్తుపై సరికొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు కదులుతామని చెప్పారు.