మెదక్, మార్చి 7(నమస్తే తెలంగాణ): విధుల నిర్వహణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని పోలీసులకు మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. విధులతో పాటు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్లో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు.
పోలీస్ పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సిబ్బంది మధ్య సమన్వయం పెరుగుతుందని మహేందర్ అన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ఒత్తిడితో కూడిన విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొదించుకోవాలని సూచించారు.