జహీరాబాద్, జనవరి 27: జహీరాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో మట్కా నిర్వాహకులపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25న ‘నమస్తే తెలంగాణ’లో ‘సరిహద్దు పల్లెల్లో జోరుగా మట్కా’ అనే వార్త ప్రచురితమైంది. శనివారం ఉదయం జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు రెండు బృందాలు జహీరాబాద్ పరిధిలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి 6 మందిని అదుపులోకి తీసుకుని రూ. 1,43,500 నగదును సీజ్ చేశారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రంజోల్ గ్రామంలో మట్కా నిర్వహిస్తున్న కృష్ణ(40), కంటి రవి (38), కంటి రాజు(49), చిలకపల్లి చంద్రయ్య(49), పట్టణంలోని సుభాశ్గంజ్లో బోయిని నర్సిములు(40), కూరేశ్ యాదుల్(40)లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జహీరాబాద్ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.