ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు
మూడు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం
నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి పంపిణీ
మెదక్/ మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట రూర ల్, ఫిబ్రవరి 27: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పోలియో చుక్కల పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు ఐదుసంవత్సరాల్లోపు చిన్నారులందరికీ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, పంచాయతీ కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ చిన్నారులు జీవిత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పోలియో చుక్కలతో నిండు జీవితం చక్కగా ఉంటుందని మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో వైద్య ఆరో గ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయా వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు పోలియో చుక్కలు వేశారు.
94.2 శాతం
మెదక్ జిల్లాలో తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఐదేండ్లలోపు చిన్నారులు 73,450 మందిలో తొలి రోజు 94.2 శాతం పోలియో చుక్కలు వేశారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ జిల్లాలో 69,256 మంది చిన్నారులకు తొలిరోజు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 469 గ్రామ పంచాయతీల్లో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇటుక బట్టీలు, క్వారీలు, వలస, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఉండే సమస్యాత్మక ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
చుక్కల మందు తప్పనిసరి: జడ్పీ చైర్పర్సన్
మనోహరాబాద్, ఫిబ్రవరి 27: ఐదేండ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దత్తత గ్రామమైన మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో పిల్లలకు పోలియో చుక్క లు వేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. కొన్ని వార్డులో అంతర్గత మురుగు కాల్వలు కావాలని ప్రజలు కోరడంతో స్పం దించిన ఆమె నిధులు మంజూరు చేస్తానన్నారు. గౌతోజిగూడెంలో 95 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ పురం నవనీతా రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.
27ఎంబీడీ01 : మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్
సంగారెడ్డి జిల్లాలో 91.7 శాతం
సంగారెడ్డి కలెక్టరేట్. ఫిబ్రవరి 27: జిల్లాలో 91.7 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం తొలిరోజు నిర్వహించిన కార్యక్రమంలో 1,86,190 చిన్నారుల్లో 1,70,737 మందికి చుక్కల మందు వేశారు. ఇందుకోసం 36 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. 1,119 బూత్‌ల్లో 922 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 197 బూత్‌లు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. జిల్లాలో 91.7 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసుకోని పిల్లలను గుర్తించి చుక్కల మందు వేస్తారు. జిల్లాలోని అన్ని ప్రయాణ ప్రాంగణాలు, వలస కార్మికుల నివాస ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనుల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
చిన్నారులందరికీ చుక్కల మందు వేయించాలి ; సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 27: చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శశాంక్, వైద్యులు, ఏఎన్ఎంలు, తల్లిదండ్రులు, కౌన్సిలర్లు విష్ణువర్ధన్, సోహెల్, నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.