ఇంగ్లిష్ మాధ్యమంలో బొంతపల్లి స్కూల్ సక్సెస్
డిజిటల్ క్లాసులు- కంప్యూటర్ ల్యాబ్- లైబ్రరీ
ఇతర రాష్ర్టాల చిన్నారులకు ఇక్కడ ఆంగ్ల విద్య
ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు గ్రామర్ సర్కిల్
ఆకట్టుకుంటున్న వాల్ పెయింటింగ్స్
కార్పొరేట్‌కు దీటుగా జడ్పీహెచ్ఎస్
గుమ్మడిదల, ఫిబ్రవరి 25: ఆ సర్కారు బడిలో పాఠశాల గోడలు కూడా పాఠాలు చెబుతాయి..! ఆంగ్లంలో గలగలా మాట్లాడుతున్న ఆ పాఠశాల విద్యార్థులను చూస్తే కార్పొరేట్ స్కూల్ వారు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంగ్లిష్ మాధ్యమంలో బొంతపల్లి ప్రభుత్వ పాఠశాల సక్సెస్ సాధిస్తున్నది. పారిశ్రామిక వాడ కావడంతో ఇతర రాష్ర్టాల చిన్నారులు కూడా ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారికి సైతం ఇక్కడి పాఠశాల ఉపాధ్యాయులు ఆంగ్ల విద్యను బోధిస్తున్నారు. గ్రామర్ సర్కిల్, వాల్ పెయింటింగ్స్‌తో పాటు ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు ఆంగ్లంలో ఆరితేరుతున్నారు. ప్రతి ఏడాది ఈ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి.
ఆ పాఠశాల విద్యారులు ‘స్కూల్ విజన్-స్కూల్ మిషన్’కు సిద్ధం. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌లో చకచకా మాట్లాడేలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సర్కిల్‌ను తయారుచేసి నేర్పిస్తున్నారు. 2009-2010 నుంచి సక్సెస్ స్కూల్‌గా విద్యార్థులకు ఇంగ్లిష్- తెలుగు మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామికవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మాధ్యమంలో సక్సెస్ స్కూల్‌గా పేరుగాంచింది. ప్రతి ఏడాది పదో తరగతిలో వందశాతం విద్యార్థులు 10/10 జీపీఏలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు ట్రిఫుల్ ఐటీ, గురుకులాల్లో సీట్లను సాధించి ఉన్నత విద్యవైపు కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’తో సర్కారు పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇంగ్లిష్ గ్రామర్‌కు సర్కిల్ దృశ్యం..
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా విద్యార్థులు ఇంగ్లిష్‌ను నేర్చుకోవడానికి పాఠశాల ప్రాంగణంలో టీచర్లు సంపత్, చంద్రకళ సర్కిల్ దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కు సంబంధించిన సర్కిల్‌ను తయారు చేశారు. దీనిద్వారా ఇంగ్లిష్‌ను ఏవిధంగా నేర్చుకోవాలి, ఏవిధంగా మాట్లాడాలో సులభంగా అర్థమవుతుంది.
డిజిటల్ విద్యాబోధన..
జడ్పీహెచ్ఎస్ బొంతపల్లిలో కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. ప్రతి విద్యార్థి డిజిటల్ విద్యపై ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా టీచర్లు బోధిస్తున్నారు.
తరగతి గదుల్లో వాల్ పెయింటింగ్స్..
6-10 తరగతి గదిలో 3ఆర్ (సైన్స్, ఇంగ్లిష్, గణితం) పద్ధతి లో తరగతి గదుల్లో వాల్ పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ 3ఆర్ పద్ధతిని ఏర్పాటు చేశారు. ఇందులో సైన్స్‌కు సంబంధించిన పరికరాలు, వాటి పనితీరు, ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు వంటి అంశాలు ఉంటాయి. ఇంగ్లిష్‌లో ప్లవర్ టేబుల్స్, వృక్షాలు, మానవుడికి శరీర భాగాలు, కూరగాయలు, జంతువులు వంటి వివిధ రకాల పదాలు, వాటిని ఏవిధంగా మాట్లాడాలో సులభ పద్ధతిలో ఉంటాయి. తెలుగులో వ్యాకరణం, అక్షరమాల, గుణింతాలు, సందులు వంటి అంశాలు ఉంటాయి. దీనిద్వారా ప్రతి రోజు గోడలపై ఉన్న 3ఆర్ సిస్టం ద్వారా వెనుకబడిన విద్యార్థులు మొదటి వరుసలో రావడానికి కృషి చేస్తారు. వాల్ పెయింటింగ్స్ ద్వారా విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు. తరగతి గదులో సైన్స్ దృశ్యాలు 6వ తరగతి నుంచి పది వరకు ఉన్న గదుల గోడలకు సైన్స్, గణితం, ఇంగ్లిష్ సంబంధించిన ఫార్మూలాలు, చిత్రాల ద్వారా సులభంగా అభ్యసించడానికి వీలుగా ఉంటాయి. ఈ గదుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ప్రతిరోజు చూడడంతో గుర్తుండి పోయేలా ఉంటాయి.
అబ్బురపరుస్తున్న సైన్స్ ల్యాబ్..
పాఠశాలలో సైన్స్‌ల్యాబ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులకు సైన్స్ పాఠ్యాంశాలను బోధిస్తారు. సైన్స్‌కు సంబంధించిన అన్ని రకాల పరికరాలు ఉండడంతో ప్రతి విద్యార్థికి సైన్స్‌పై మక్కువ పెరుగుతున్నది. సైన్స్ టీచర్ ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు బోధన చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ సైన్స్‌ల్యాబ్ ఉంది.
కంప్యూటర్ ల్యాబ్…
విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కలిగించడానికి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవగాహన కోసం కంప్యూటర్ను ఏవిధంగా నేర్చుకోవాలో తరగతులు, శిక్షణ ఇస్తున్నారు.
ఇంగ్లిష్ అంటేనే ఇష్టం..
ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ ఉండాలని సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం. మా పాఠశాలలో ప్రతి ఒక్కరూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాం. ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటున్నాం. మా పాఠశాలలో సార్లు మంచిగా ఇంగ్లిష్ నేర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ సారు ‘మన ఊరు-మనబడి’ ద్వారా కేజీ నుంచి పీజీ దాక ఇంగ్లిష్ అమలు చేయడం బాగుంది.
– కాజల్, విద్యార్థిని, పదో తరగతి
నాణ్యమైన విద్యనందిస్తున్నాం..
మా పాఠశాలలో ఇంగ్లిష్, తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ఉంది. ఇంగ్లిష్ మీడియంలో 250 మంది, తెలుగు లో 160 మంది విద్యార్థులున్నారు. ‘స్కూల్ విజన్- స్కూల్ మిషన్’ ద్వారా సక్సెస్ బాటలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ముందుకు తీసుకు పోతున్నాం. ప్రతి సంవత్సరం పదికి పది జీపీఏ సాధిస్తున్నారు. తల్లిదండ్రుల నమ్మకం వమ్ముకాకుండా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.- అనసూయ, హెచ్ఎం జడ్పీహెచ్స్కూల్ బొంతపల్లి