గజ్వేల్, డిసెంబర్ 1: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. స్థానిక నాయకుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఎక్కడ చూసినా యువత, పార్టీ నేతలు గుంపులు, గుంపులుగా చేరి ఇండ్లల్లోకి వెళ్లి ఓట్లు అడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న వారందరికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడంతో ఇతర పార్టీల్లో చేరడంతో విభేదాలు తీవ్రమతున్నాయి.
సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని గ్రామాల్లో వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 163గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 747 మంది పోటీల్లో ఉన్నారు. వార్డులకు 3429 మంది పోటీలో ఉన్నారు. తొలి విడత జరుగనున్న ఏడు మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గ్రామాల్లో ప్రధాన అనుచరుల ఓటమే లక్ష్యంగా కొన్ని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎప్పుడు కలువని రాజకీయ పార్టీల నేతలు పగోడి ఓటమే లక్ష్యంగా ఒక్కటవుతున్నారు.
ఢిల్లీలో కోట్లాడుకునే నేతలు గల్లీలో మాత్రం స్నేహం చేస్తూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను పంచుకొని పోటీలో ఉన్నారు. తొలి విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు అభ్యర్థులు కరువయ్యారు. అదే తరహాలో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడంలో ఇద్దరి మధ్య స్నేహబంధం పోటీ చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరిగే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఇదే కనిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలోని ఓ గ్రామంలో అధికార కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకకపోగా బీఆర్ఎస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. దాంతో బీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్‌లో చేరగా సర్పంచ్ అభ్యర్థి అయ్యాడు.
కాంగ్రెస్ కార్తకర్త బీజేపీలో చేరగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. మండల పరిధిలోని మరో గ్రామంలో కాంగ్రెస్ నుంచి సర్పంచ్‌గా పోటీలో ఉండగా కొన్ని వార్డులు బీజేపీకి కేటాయించగా ఉప సర్పంచ్ ఇస్తామనడంతో కలిసి పనిచేస్తున్నారు. చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలు ఉమ్మడిగా సర్పంచ్, వార్డుసభ్యులు పోటీలో ఉన్నారు. ప్రతి రోజూ తెల్లారితే తిట్ల పురాణంలో మునిగే నాయకులు ఇక్కడ మాత్రం రెండు పార్టీల నాయకులు ఉమ్మడిగా పోటీలో ఉండడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ రాజకీయం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3వతేదీ వరకు ఉండడంతో గ్రామాల్లో రాజకీయాలు ఎలా మారుతాయో వేచిచూడాలి.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు కొన్ని గ్రామాల్లో తీవ్రమైన పోటీ ఉండడంతో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున సర్పంచ్‌గా పోటీలో ఉండేందుకు నామినేషన్లు వేశారు.అదివారం అధికారులు నామినేషన్ల పరిశీలనను పూర్తి చేశారు. మూడో తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండడంతో ఒక పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీలో ఉన్న వారిలో బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచి మిగతా వారిని పోటీ నుంచి ఉపసంహరించుకునేలా పార్టీ బాధ్యులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో పాటు పరిశీలన పూర్తవడంతో ఆయా రాజకీయ పార్టీ నేతలు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్న వారికి మాట్లాడుదామంటూ ఫోన్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో ఎంత మందిని బుజ్జగింపు చేస్తారో ఆయా రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది.